Tuesday, July 15, 2025
Homeవిశ్లేషణసమాజంలో ఏదీ శాశ్వతం కాదు

సమాజంలో ఏదీ శాశ్వతం కాదు

ఆటవిక మానవుడు నాగరికుడుగా మారి తన తోటి మనుషులతో కలిసి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకుని తన మనుగడకు కావల్సినవన్ని ఏర్పాటు చేసుకుని తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. సనాతన ధర్మం మరవరాదని దాన్ని విస్మరిస్తే మనిషి దానవుడిగా మారి విధ్వంసం సృష్టిస్తాడని, కనుక సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని ఈ మధ్య కొందరు నాయకులు పదేపదే ఆ మాట వల్లె వేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ వారు, వారికి తోడు మన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఈ మాట పదేపదే వాడుతున్నారు. అసలు సనాతనం అంటే మారనిది అని అర్థం అని పెద్దల చెబుతున్నారు. కాని సమాజ స్థితిగతులు ఆయా పరిస్థితులను బట్టి మారుతూనే ఉంటుంది. సనాతన ధర్మం కోరే మనుషులు ఇప్పుడు సనాతనులుగా లేరు. కాకపోతే ఆ సనాతన ధర్మం కావాలంటారు. అసలు సమాజంలో ధర్మం కాలానుగుణ్యంగా మారుతూనే ఉంటుంది. మారనిది జడ పదార్థమే. సనాతనుడు కట్టిన బట్ట ఇప్పుడు లేదు. ఆనాటి సనాతనుని ఆచార వ్యవహారాలు సనాతనం కావాలనుకునే వారెవరూ ఇప్పుడు పాటించడం లేదు.
కాని సనాతన ధర్మం అవసరం అంటారు. మారిన, మారుతున్న మనిషికి మారని సనాతనం ఎలా కుదురుతుంది. సాంకేతిక విజ్ఞానం అందించిన అన్ని సౌకర్యాలు పొందుతూనే సనాతనం అవసరం అంటారు. మహిళలకు చదువు అవసరం లేదని, ఇంటిపని, కుట్టుపని, వంటపని నేర్పే చదువు చాలని మగవారికున్న శక్తి సామర్థ్యం వారికుండదని, చివరకు మెదడు కూడా పరిమాణంలో చిన్నదని, అందుకని మహిళలు చదువరాదన్న సనాతనం ఇప్పుడు అవసరమా. చట్టసభలలో 50 శాతం మహిళలుండాలని, అలా చట్టం చేయాలని ఒకపక్క కోరుతూ, మరోపక్క సనాతన ధర్మం, ఆనాటి ఆచారాలు కావాలని కోరే వారిని ఎలా అర్థం చేసుకోవాలి. స్త్రీ, పురుషులకు భిన్నమైన బాధ్యతలు అప్పచెప్పిందని ఆ విషయం మరువరాదని చదువుకుంటే మహిళలు చెడిపోతారని సనాతనులు అంటుంటే దాన్ని ఈరోజు సమర్పించే వారిని ఎలా అర్థం చేసుకోవాలి.
సంస్కరణవాదులు, మతం, కులాలను నాశనం చేస్తున్నారని అందువల్ల సమాజంలో జాతి శక్తి నాశనం అవుతోందని కూడా సనాతనుల వాదన. బ్రాహ్మణేతరులు, మహిళలు చదువుకోవడానికి అనర్హులుగా సనాతనుల వాదన. డి.కె.కార్న్‌ మహిళా విశ్వవిద్యాలయం స్థాపించిన తరువాత కూడా దాదాపు 1918 వరకు అదే వాదన సనాతనులు వినిపించారు. భర్త ఎంత చెడ్డవాడయినా భర్త నుంచి విడాకులు తీసుకునే హక్కు మహిళలకు ఉండరాదని కూడా సనాతనుల వాదన. సావర్కార్‌ అభిప్రాయంలో సనాతన ధర్మం, శృతి, స్మృతి, పురాణాలను పౌరాణిక గ్రంథాలుగా గుర్తించి వాటిని పాఠ్యాంశాలుగా చేర్చాలనేది ఆయన వాదన.
అసలు ఏ తాత్విక భావజాలాన్ని అయినా అర్థం చేసుకోవడానికైనా ఆచరణలో వాటి ఫలితాలను అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. అంతకంటే ఘోరంగా స్త్రీలు చదువుకుంటే తల్లులుగా, భార్యలుగా తమ కార్యకలాపాలు నిర్వర్తించలేరని కూడా వ్యాఖ్యానించారు. హరిజనులు దేవాలయ ప్రవేశానికి బిల్లు పెడితే సనాతన వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా సనాతనవాదులు వారు చెప్పేవన్ని దైవిక ధర్మానికి చెందినవి కనుక వాటిని కాదనడం ధర్మ విరుద్ధంగా భావించాలని కూడా వాదించారు. ఈ సనాతన ధర్మం అనే భావన చివరకు హిందూయిజానికి మరో పేరుగా మారింది. పంచమ వర్ణంగా పేర్కొన్న నిచ్చెన మెట్ల వ్యవస్థను రక్షించడమే సనాతన ధర్మంగా సనాతన వాదులు పేర్కొన్నారు. వాటికి కట్టుబడి ఉండి ఆ ధర్మాన్ని కాపాడటమే సనాతన వాదుల కర్తవ్యం, ధర్మమన్నారు.
1951 లో న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్‌ హిందూ కోడ్‌ బిల్లును చట్టసభల్లో ప్రవేశపెడితే రాజేంద్రప్రసాద్‌తో సహా సనాతనవాదులందరూ వ్యతిరేకించి తిరగబడ్డారు. పైగా ఆ బిల్లును ఆమోదిస్తే హిందూ సంస్కృతి అనబడే గొప్ప నిర్మాణం, జీవన విధానం నాశనమవుతుందని వాదించారు. బౌద్ధ్దం, ఇస్లాం, క్రైస్తవం ఎన్ని సవాళ్లు విసిరినా వైదిక మతం నాశనం కాలేదని, కాని అంబేద్కర్‌ ఒక్క కలంపోటుతో నాశనం చేయాలని చూస్తున్నాడని ఆక్రోశించారు. బహు భార్యత్వాన్ని నిషేధించడం హిందూ ధర్మాన్ని నాశనం చేసే కుట్రగా సనాతనులు భావించారు. అంతేగాక బ్రాహ్మణులకు వదలిన వాటిపై జోక్యం చేసుకునే అధికారం, అర్హత అంటరాని వారికి లేదని అంబేద్కర్‌పై విరుచుకుపడ్డారు. సనాతన ధర్మం అంటే మానవ ధర్మమని దాన్ని కించపరిచే అర్హత ఎవరికి లేదని పేట్రేగి పోయారు. ధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మమే ధర్మమని మిగతావన్ని రకరకాల తెగలని వ్యాఖ్యానించారు. అందుకే హేతుబద్దతను, నైతికతను నిరాకరించే వేదాలను, శాస్త్రాలను డైనమెట్లతో పేల్చి వేయాలన్నారు అంబేద్కరు. ప్రస్తుతం సనాతన ధర్మం అవసరమని ఆ ధర్మాన్ని వల్లె వేస్తూ మాట్లాడేవారు ఎటువంటి సనాతన ధర్మం కావాలో వివరించవలసిన అవసరం ఉంది.

సెల్‌: 988556394

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు