Homeఐక్య ఉద్యమాలు అవశ్యం

ఐక్య ఉద్యమాలు అవశ్యం

- Advertisement -

. బీజేపీ నుంచి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
. ఇండియా ఐక్యసంఘటనను బలోపేతం చేద్దాం
. 9న జరిగే సార్వత్రిక సమ్మె ను విజయవంతం చేయండి
. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపు

న్యూదిల్లీ : బీజేపీ నుంచి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు లౌకిక-ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ… దేశ పరిస్థితులు, పార్టీ బలోపేతం దిశా నిర్దేశం చేశారు .24వ పార్టీ జాతీయ మహాసభలు విజయవాడలో జరిగిన తర్వాత దేశంలో, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక ,సామాజిక పరిణామాల్లో భారీ మార్పులొచ్చాయన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, ప్రజల జీవనోపాధి, దేశ రాజ్యాంగానికి తీవ్రమైన సవాళ్ల మధ్య చండీగఢ్‌లో ఈ ఏడాది సెప్టెంబరు 21 నుంచి 25వరకు 25వ పార్టీ జాతీయ మహాసభలు జరుగుతున్నాయని చెప్పారు. కొంతకాలంగా బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి లౌకికవాదం, ప్రజాస్వామ్య సంస్థలు, సమాఖ్యవాదాన్ని మరింత దూకుడుగా బలహీనపరుస్తూ… మతోన్మాద వైఖరిని కొనసాగించింది. మైనారిటీల హక్కులపై, ముఖ్యంగా ముస్లింలపై, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, దర్యాప్తు సంస్థల స్వాతంత్య్రాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తూ…వ్యవస్థీకృత దాడి జరిగింది. ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలను దుర్వినియోగపర్చడం ద్వారా ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకున్నారు. వివాదాస్పద వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదన, పాఠ్యపుస్తకాలలో తిరోగమన మార్పులు, విశ్వవిద్యాలయాలు, పౌర సమాజ సంస్థలపై నిరంతర దాడులు బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్ట్‌ స్వభావాన్ని ప్రతిబింబిస్తాయని రాజా అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు ఒక ముఖ్యమైన రాజకీయ మార్పును గుర్తించాయని...బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారాన్ని నిలుపుకున్నప్పటికీ బీజేపీ సొంతంగా మెజారిటీని సాధించలేకపోయిందన్నారు. ఇప్పుడు మిత్రపక్షాలపై ఆధారపడి ఉందన్నారు. ఈ ఫలితాలు నిరంకుశ పాలన, కార్పొరేట్‌ అనుకూల విధానాలు, సామాజిక ధ్రువీకరణపై పెరుగుతున్న ప్రజా అసంతృప్తిని ప్రతిబింబిస్తాయన్నారు. అనేక పరిమితులు ఉన్నప్పటికీ ‘ఇండియా ఐక్యసంఘటన’ భారతదేశ రాజ్యాంగానికి, అందులో పొందుపరిచిన విలువలకు ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ నుండి ముప్పును ప్రతిఘటించే విశ్వసనీయ ప్రజాస్వామ్య శక్తిగా ఉద్భవించిందని రాజా తెలిపారు. సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు… కార్మికులు, రైతులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, యువత, విద్యార్థులు, మైనారిటీల డిమాండ్లను సమీకరించడం… వ్యక్తీకరించడంలో సూత్రబద్ధ పోరాట పాత్రను పోషించాయన్నారు. ఇండియా ఐక్యసంఘటన ఆవిర్భావం లౌకిక-ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేయడానికి ఒక సానుకూల అడుగు అయినప్పటికీ సమన్వయం, స్థిరమైన సైద్ధాంతిక రేఖ లేకపోవడం, కీలకమైన సీట్ల పంపిణీ చర్చల సమయంలో పెద్ద పార్టీల సంకోచాల వల్ల దాని ప్రభావం తీవ్రంగా దెబ్బతిందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏర్పడిన అనేక కమిటీలు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. పరస్పర విశ్వాసం, సర్దుబాటు లేకపోవడం కూటమి ఐక్యత మరియు నిలకడైన ప్రచారాన్ని నిర్వహించే సామర్థ్యాన్ని తీవ్రంగా బలహీనపరిచిందన్నారు. అనేక రాష్ట్రాలలో, సమగ్ర ప్రత్యామ్నాయాన్ని, ఉమ్మడి కార్యాచరణ ప్రదర్శించలేకపోవడం… ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ బీజేపీ అధికారాన్ని నిలుపుకోవడానికి లేదా తిరిగి పొందడానికి వీలు కల్పించింది.
ఆర్‌ఎస్‌ఎస్‌`బీజేపీ సైద్ధాంతిక, రాజకీయ కథనాన్ని గట్టిగా, సామూహికంగా సవాలు చేయడంలో విఫలం కావడం ప్రతిపక్షంలో విభేదాలను ఉపయోగించుకోవడానికి బీజేపీని అనుమతించింది. అయితే ఇండియా ఐక్యసంఘటన ప్రయోగం బీజేపీని ఎన్నికలలో ఓడిరచవచ్చని స్పష్టం చేసింది. భాగస్వామ్య పార్టీల మధ్య పటిష్టంగా ఐక్యత సాధించాల్సి ఉంది. లౌకిక-ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతను పటిష్టం చేయడంలో సీపీఐ తన స్వతంత్ర స్వరాన్ని నిలబెట్టుకుంటూ తన పాత్రను పోషించాలి.
ఆర్థిక రంగంలో, మోదీ ప్రభుత్వ నయా-లిబరల్‌, కార్పొరేట్‌ అనుకూల విధానాలపై తన నిబద్ధతను ఉధృతం చేసింది. వ్యూహాత్మక రంగాలతో సహా ప్రభుత్వ ఆస్తుల భారీ ప్రైవేటీకరణ జరుగుతోంది. అయితే అసమానత తీవ్ర స్థాయికి చేరుకుంది. దేశ సంపదలో 40% కంటే ఎక్కువ సంపద 1% ధనికుల నియంత్రణలో ఉంది. మరోపక్క కార్మిక వర్గం, నిరుద్యోగులు, రైతులు, అసంఘటిత రంగ కార్మికులు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చాలీచాలని వేతనాలు, కుప్పకూలుతున్న సంక్షేమ పథకాల కింద నలిగిపోతున్నారన్నారు. రైతులకు ఎంఎస్పీ హామీ నెరవేరలేదని, గ్రామీణ ప్రాంతాల దుస్థితి, రుణభారం నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని, ఈ నెల9 న జరిగే సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని రాజా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు