Homeస్మార్ట్‌ మీటర్ల షాక్‌

స్మార్ట్‌ మీటర్ల షాక్‌

- Advertisement -

ప్రజలపై విద్యుత్‌ బిల్లుల భారం

. రూ.15,485 కోట్ల బాదుడు
. ఏడాదిలో నాలుగు సార్లు పెంపు
. అదానీతో సోలార్‌ విద్యుత్‌ ఒప్పంద ప్రభావం
. రేపు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నిరసనలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విద్యుత్‌ బిల్లులు దడ పుట్టిస్తున్నాయి. స్మార్ట్‌ మీటర్లు బిగింపుతో అధికంగా బిల్లులు రావడంపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది కాలంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్‌ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై రూ.15,485 కోట్ల భారం మోపింది. గతంలో ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు విద్యుత్‌ చార్జీల పెంపుదలను తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును అడ్డుకోవాలని, అవసరమైతే పగలగొట్టాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చి…ఎడాపెడా విద్యుత్‌ చార్జీలను వడ్డించడంతో గృహ, వాణిజ్య వినియోగదారులపై ఆర్థిక భారం పడుతోంది. గత ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకివస్తే విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును రద్దు చేస్తామని, అక్రమంగా జరిగిన సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో 4 సార్లు విద్యుత్‌ భారాలను వినియోగదారులపై మోపింది. దీనికితోడు గృహ వినియోగాలకు సంబంధించి విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించేందుకు సిద్ధమైంది. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాల వల్ల 25 ఏళ్లపాటు దాదాపు లక్షా పదివేల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుంది. ఈ ఒప్పందాలపై ఎన్డీఏ ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదు. ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చి విద్యుత్‌ చార్జీల భారాలను మోపడం..దారుణంగా మోసగించడమేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్మార్ట్‌ మీటర్లపై తీవ్ర వ్యతిరేకత
రాష్ట్రంలో నివాస గృహాలకు ప్రీపెయిడ్‌ విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల బిగించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. తొలి దశలో 41 లక్షల ఇళ్లకు ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించారని సమాచారం. మొత్తంగా రెండు కోట్ల కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీనిని ఏపీడీసీఎల్‌ నేతృత్వంలో నిర్వహిస్తారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని ముఖ్యనగరాలలో 10.28లక్షల ఇళ్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇళ్లకు బిగిస్తున్న విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల వల్ల వినియోగదారులకు, ప్రజలకు కలిగే లాభం ఏమిటని వామపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి. స్మార్ట్‌ మీటర్ల బిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. వినియోగదారుల గొంతు కోయడానికి, అదానీ, షిర్డీసాయి కంపెనీలను ఉద్ధరించడానికే వాటిని అమలు పరుస్తున్నారని ధ్వజమెత్తుతున్నాయి. ఒక్కో స్మార్ట్‌ మీటర్‌కు రూ.12వేల నుంచి రూ.18 వేల వరకు ఖర్చవుతోంది. ప్రతినెలా ఇచ్చే విద్యుత్‌ బిల్లులో దీనిని కలుపుతారని సమాచారం. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వినియోగ దారులపై ఏడాదికి భారం రూ.50వేల కోట్లు ఉంటుంది. స్మార్ట్‌ మీటర్ల బిగింపు కారణంగా అన్నమయ్యజిల్లాకు చెందిన ఓ ఫ్లోర్‌మిల్‌ నిర్వాహకుడుకి నెలకు రూ.10వేలలోపు విద్యుత్‌ బిల్లు వస్తుండగా, ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలకు బిల్లు అధికంగా వచ్చింది. ఆ బిల్లుతో విద్యుత్‌ అధికారులను ఆయన సంప్రదించగా, ఇక చేసేదేమీ లేదు…బిల్లు కట్టాల్సిందేనంటూ ఆదేశాలు జారీజేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ఆదేశాలకు చంద్రబాబు ప్రభుత్వం లొంగకుండా ప్రజల క్షేమం కోరుకుంటే వెంటనే స్మార్ట్‌ మీటర్లను ఉపసంహరించుకోవాల్సి ఉంది. స్మార్ట్‌ మీటర్ల ద్వారా విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయన్న ఫిర్యాదులతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇటీవల విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పందిస్తూ… క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలపై విద్యుత్‌ బిల్లుల భారం పడకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వినియోగదారులపై మోపిన విద్యుత్‌ సర్దుబాటు చార్జీలు తగ్గించాలని, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, అదానీతో జరిగిన సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలని సీపీఐ డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు ప్రజలపై విద్యుత్‌ భారాలను వ్యతిరేకిస్తూ ఈనెల 5న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పార్టీ పిలుపునిచ్చింది. అన్ని జిల్లాల్లో జరిగే ఈ నిరసనలలో అన్ని వర్గాల ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని కోరింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు