సి.జె.అట్కిన్స్
చిలీలో నవంబర్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందుగా ఆదివారం జరిగిన ఎన్నికల్లో యూనిటీ ఫర్ చిలీ (యునిడాడ్పోర్ చిలీ) సంకీర్ణ కమ్యూనిస్టు పార్టీకి చెందిన జీనెట్ జారా అధ్యక్ష పదవి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మితవాద( రైట్-వింగ్) అభ్యర్థులు జోస్ ఆంటోనియో కాస్ట్, ఎవెలిన్ మాథీలు పొటీచేయనున్నారు. ప్రస్తుత ఈ పాలక కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న గాబ్రియెల్ బోరిక్ దేశ అధ్యక్షుడుగా ఉన్నారు. ఆదివారం జరిగిన నలుగురు అభ్యర్థుల రేసులో జారా అద్భుతంగా 60శాతం ఓట్లను సాధించారు. ఆమె తర్వాత అత్యంత సమీప ప్రత్యర్థి డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీకి చెందిన కరోలినా టోహాకు 27.7శాతం ఓట్లు వచ్చాయి. యూనిటీ ఫర్ చిలీ సంకీర్ణంలోని పార్టీలు ప్రైమరీలో ఏ అభ్యర్థి గెలిచినా వారికి తాము మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపధ్యంలో దేశంలోని అన్ని వామపక్ష, ప్రగతిశీల శక్తులు అధ్యక్ష అభ్యర్థి జారాకు తమ మద్దతును తెలియజేశాయి..
ఎలక్టోరల్ సర్వీస్ జారా విజయాన్ని ప్రకటించిన అనంతరం సోషల్ మీడియాతో మాట్లాడుతూ న్యాయమైన, ప్రజాస్వామ్య చిలీని నిర్మించాలనే దృఢ నిశ్చయంతో ఈ రోజునుంచి మనం కలిసి నడిచే నూతన మార్గం ప్రారంభమవుతుందని ప్రకటించారు. అత్యంత మితవాద పార్టీలనుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొంటూ మేము ఐక్యతతో ప్రతిస్పందిస్తామని అన్నారు. ఆదివారం తమ మద్దతుదారులతో పెద్ద ఎత్తున జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ, మనం ఐకమత్యంతో అత్యంత మితవాద అభ్యర్థులను ఈ ఎన్నికల్లో ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చిలీ ప్రస్తుత అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ఆమెను అభినందించారు. అధ్యక్ష పదవీకాలంపై రాజ్యాంగ పరిమితుల కారణంగా తిరిగి బోరిక్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంలేదు. భవిష్యత్తులో దేశాన్ని ప్రగతిశీల శక్తులతో కలిసి నడిపించడానికి జారా పయనం ఉంటుందని బోరిక్ వ్యాఖ్యానించారు. అయితే భవిష్యత్తువైపు పయనం అంత ఆశాజనకం కాదు. ఆమెకు దేశాన్ని అభ్యుదయంవైపు నడిపించేందుకు చేపట్టవలసిన పోరాటాలు ఆమెకు కొత్తేమీకాదు. సురక్షితమైన, సంతోషకరమైన, ఐక్యతకోసం నడిపించే దేశాన్ని నిర్మించడంకోసం అందరం కలిసి పనిచేద్దాం అంటూ జారా మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని కలిగించారు.చిలీ దేశంలోని అత్యంత ప్రముఖ రాజకీయ నాయకులలో 51 ఏళ్ల జారా ఒకరు. అధ్యక్ష పదవికి పోటీ చేయడానికిగాను ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కార్మిక మంత్రిగా జారా చిలీలో పని గంటల్ని వారానికి 45 నుంచి 40 గంటలకు తగ్గించారు. కార్మికుల కనీస వేతనాన్ని పెంచడానికి ఆమె కృషిచేశారు.
జారా సంకీర్ణం, ‘‘ప్రజల హక్కులను కాపాడేందుకు’’ ప్రయత్నిస్తుందని ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛా మార్కెట్‌ను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. చిలీలో చారిత్రాత్మక సామాజిక మార్పు కోసం కృషి చేస్తుందని, స్త్రీలు, యువత, స్థానిక ప్రజలు, సామాజిక-పర్యావరణ ఉద్యమ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. జారా అభ్యర్థిత్వం అట్టడుగు వర్గాలలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ‘‘మాకు అండగా నిలిచిన వారికి చిలీమహిళలు మద్దతు ఇస్తున్నాము’’ అని చిలీ ప్రధాన కార్మిక సమాఖ్య, వర్కర్స్ యునైటెడ్ సెంటర్ ఆఫ్ చిలీ ఉపాధ్యక్షురాలు కరెన్ పాల్మా అన్నారు.
అయితే చిలీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి కాస్ట్ అధ్యక్ష పదవికి మూడవసారి యత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు బోరిక్ చేతిలో కాస్ట్ ఓడిపోయాడు. మొదటి రౌండ్ అనంతరం జరిగిన రెండవ రౌండ్లో కాస్ట్ 44శాతం ఓట్లను సాధించాడు. కాస్ట్ చిలీ పాలకవర్గానికి చెందిన మితవాద విభాగంలో భాగస్వాముడు. ఆయన తల్లిదండ్రులు 1950ల ప్రారంభంలో చిలీకి వచ్చిన జర్మన్ వలసదారులు. అతని తండ్రి మైఖేల్ కాస్ట్ షిండేలే హిట్లర్ నాజీ పార్టీ సభ్యుడు, సైన్యంలో లెఫ్టినెంట్. కాస్ట్ అమెరికా నిర్బంధం నుండి తప్పించుకుని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీని విడిచి చిలీలో స్థిరపడ్డాడు. కాస్ట్ సోదరులలో ఒకరైన మిగ్యుల్, మాజీ చిలీ నియంత అగస్టో పినోచెట్ మంత్రివర్గంలో ఆర్థికవేత్త, కార్మిక మంత్రిగా పనిచేశారు. ప్రైవేటీకరణ, నియంత్రణ సడలింపు, యూనియన్లపై దాడులు, చిలీ కార్మిక వర్గాన్ని అణిచివేసే నయా ఉదారవాద విధానాలను విధించడంలో మిగుల్ తనదైన పాత్ర పోషించారు.
ఇండిపెండెంట్ డెమోక్రటిక్ యూనియన్‌కు చెందిన మితవాద అభ్యర్థి ఎవెలిన్ మాథీ కూడా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్నారు. 2024లో ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ ఆమెను ‘‘చిలీ ప్రతి-విప్లవానికి నాయకత్వం వహించే మహిళ’’గా ప్రకటించింది. ఆమె చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా ప్రభుత్వంలో పనిచేశారు. తాజా సర్వేల ప్రకారం ఆమె 10శాతం మద్దతుతో మూడవ స్థానంలో నిలిచారు.
ప్రభుత్వంలో ప్రస్తుతం పాల్గొంటున్న అన్ని పార్టీలు తీసుకున్న ఐక్య ఫ్రంట్ వైఖరిని చిలీ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడు లౌటారో కార్మోనా ప్రశంసించారు. జారా నామినేషన్ ‘‘వామపక్ష శక్తులు ఒకే పార్టీకి పరిమితం కాదని, ముఖ్యంగా కార్మికుల సంక్షేమం, హక్కులకు కట్టుబడి ఉన్న ఎనిమిది పార్టీలతో కూడిన విస్తృత సంకీర్ణంతో కూడిన కొత్త ప్రభుత్వానికి ఆహ్వానం పలుకుతోందని’’ కార్మోనా అన్నారు. జారా ప్రచారం కాస్ట్, మాథీలకు వ్యతిరేకంగా కఠినమైన పోరాటాన్ని ఎదుర్కోవలసి ఉంది. ప్రస్తుత బోరిక్ పరిపాలనకు కాబోయే వారసురాలిగా జారాకు చిలీ ప్రజలు మద్దతు పలుకుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ, దాని మిత్రపార్టీలకు చిలీ ప్రజలు మద్దతు పలుకుతారని జారా ఈసందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగం, ప్రాథమిక సంరక్షణ, ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రజా వ్యవస్థ బలోపేతం, ఆరోగ్య కార్యకర్తలు జారా ప్రభుత్వ పాలనకు తమ మద్దతు ప్రకటించారు. ప్రైవేటీకరణ కాకుండా ఆరోగ్య సంరక్షణలో మరిన్ని వనరులు అవసరమని ప్రజలు పేర్కొన్నారు. జారా దేశ ఆర్థిక వ్యవస్థపై స్పందిస్తూ ‘‘దేశ ఆర్ధికాభివృద్ధికి పునఃపంపిణీ’’ అవసరమని ప్రగతిశీల పన్నులు, మౌలిక సదుపాయాలు, విద్య, సాంకేతికతలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచుతామని పేర్కొన్నారు.


