ఇస్లామాబాద్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి టీమిండియా ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన సంగతి విదితమే. అయితే ఈ విజయంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆశ్చర్యకరమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన షోయబ్ అక్తర్… భారత్‌ను తన వీధిలోని పేద పిల్లలతో క్రికెట్ ఆడే ఓ ధనిక పిల్లాడితో పోల్చాడు. “వీధిలో ఉండే ఓ ధనిక కుర్రాడు… పేద పిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం రండి అని చెబుతాడు. చివరకు వాళ్లను ఓడించి నేనే గెలిచాను అంటాడు. ఇప్పుడు భారత్ కూడా మిగతా జట్లతో అదే చేస్తోంది. ఎనిమిది జట్లలో నాలుగింటిని మాత్రమే ఉంచుకుని, వాటిని ఓడించి కప్పు కొట్టాం అంటున్నారు. ఇలా చేసి క్రికెట్‌ను పూర్తిగా నాశనం చేశారు” అని అక్తర్ వ్యాఖ్యానించాడు. ఫైనల్‌కు ముందు కూడా క్రికెట్ బాగుండాలంటే న్యూజిలాండ్ గెలవాలని అక్తర్ ఆకాంక్షించడం గమనార్హం. అయితే, మరోవైపు భారత జట్టులోని వ్యవస్థను, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను అక్తర్ ప్రశంసించాడు. భారత దేశవాళీ క్రికెట్ బలం వల్లే మెరుగైన ఆటగాళ్లు వస్తున్నారని అన్నాడు. కష్టకాలంలో ఆటగాళ్లకు అండగా నిలిచే గంభీర్ లాంటి కోచ్ ఉండటం వల్లే సంజు శాంసన్ లాంటి వాళ్లు అద్భుతాలు చేస్తున్నారని తెలిపాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు రిటైర్ అయినప్పటికీ యువ జట్టుతో కప్పు కొట్టడం భయపెడుతోందని పేర్కొన్నాడు. రాబోయే 50 ఓవర్ల ప్రపంచకప్‌లో కూడా కచ్చితంగా భారతే ఫేవరెట్ అని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో పాక్ మాజీ బౌలర్ మహ్మద్ ఆమిర్ మాట్లాడుతూ… భారత్ బ్యాటర్లను కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారని, వారి వైఫల్యం వల్లే భారత్ సునాయాసంగా గెలిచిందని విమర్శించాడు.


