విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీ ఎక్సైజ్ పాలసీలో బార్ల వ్యాపారస్తులకు ఊరటనిచ్చేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్‌టీ) ని పూర్తిగా రద్దు చేసింది. ఎక్సైజ్ చట్టాల ప్రకారం కొన్ని విధివిధానాలను రూపొందించారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా మంగళవారం జీఓ ఎంఎస్ నంబర్ 24ను జారీ చేశారు. 2025 బార్ లైసెన్స్ నిబంధనల్లో సవరణలు చేస్తూ నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల బార్ల వ్యాపారులకు గణనీయంగా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్, డిస్టిలరీస్ కమిషనర్, ఏపీఎస్‌బీసీఎల్ అధికారులు ఈ మార్పుల అమలుకు బాధ్యత వహించనున్నారు. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయి. గతంలో బార్లకు రిటైల్ షాపుల కంటే ఎక్కువ ధరకు మద్యం సరఫరా అవుతుండటం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి తలెత్తేది. ఇప్పుడు ధరల సమానత్వంతో బార్లకు భారీ ఉపశమనం అనే చెప్పుకోవచ్చు. 2019 నవంబరు నుంచి బార్లపై ఉన్న ప్రత్యేక ఏఆర్‌టీని తొలగిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిటైల్ షాపులు, బార్ల మధ్య ఒకే మద్యానికి రెండు ధరలు ఉండబోవు. ధరల్లో సమానత్వం పునరుద్ధరించేలా నియమాలు రూపొందించారు. ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్‌ఎల్, ఎఫ్‌ఎల్‌పై అదనపు పన్ను విధింపు ఉండకూడదని ఆదేశించారు. ఈ ఉత్తర్వులతో బార్ల వ్యాపారస్తులకు మేలు జరగనుంది.
బార్ల వ్యాపారులకు ఊరట
- Advertisement -
RELATED ARTICLES


