. మోదీ భజనలో కూటమి పెద్దలు
. అన్నివర్గాలలో తీవ్ర అసంతృప్తి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విశాలాంధ్ర-విజయనగరం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రైవేటుపరం చేయడానికి సన్నద్ధమైందని, అందులో భాగంగా రాష్ట్రంలో పీఏల పాలన కొనసాగుతోందని, మంత్రి నారా లోకేష్‌ను కలవాలంటే 16 మంది పీఏలను దాటుకొని వెళ్లాల్సి వస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా విజయనగరం విచ్చేసిన ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీపీపీ విధానం పేరుతో రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈశ్వరయ్య అన్నారు. నిత్యం ప్రధాని నరేంద్ర మోదీ భజనలే కనిపిస్తున్నాయని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రధాని మోదీని కూటమి ప్రభుత్వం తమ భుజాలపై మోస్తోందని ఆరోపించారు. ఏ జిల్లాలో చూసినా వేలాది ఎకరాలను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెడుతున్నట్లు చెప్పారు. యువతకు ఉపాధి పేరుతో భారీ మోసాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జీఎస్టీ వల్ల అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌కు అతి తక్కువ లాభం చేకూరుతోందని, కానీ దీనిని కూటమి పెద్దలు గొప్పగా చెప్పడం అత్యంత దుర్మార్గమన్నారు. జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు వచ్చాయని, వాటిలో 50 శాతం సీట్లను నాడు వారు అమ్ముకుంటే… నేడు ఆ కళాశాలలను పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు, కార్పొరేట్ పెద్దలకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్రేనని ఈశ్వరయ్య విమర్శించారు. గడిచిన 18 మాసాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల ముందు ప్రతి ఆడబిడ్డకు రూ.1500 ఇస్తామన్నారని, కానీ ఆ హామీ నేటికీ అమలు చేయలేదన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామని, నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తామని చెప్పారని, ఇప్పుడు ఆ ఊసే ఉత్తడం లేదన్నారు. 20 లక్షల ఉద్యోగాల హామీ మేరకు ఒక్క డీఎస్సీ తప్ప ఇతర ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు. నిరుద్యోగులలో అసంతృప్తి పెరుగుతోందన్నారు. గిరిజన ప్రాంతాలలో డోలీ వ్యవస్థ ఇంకా కొనసాగడం సిగ్గుచేటన్నారు. మన్యం జిల్లాలో ఓ గిరిజన వసతి గృహంలో మంచినీరు లేక విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారంటే ప్రభుత్వ ఏ విధంగా పనిచేస్తుందో అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ బడితే అక్కడ బెల్టు షాపులు కొనసాగుతున్నాయని, మద్యం ఏరులై పారుతోందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే… జిల్లాకు రెండు విమానాశ్రయాలు, అమరావతిలో 1600 ఎకరాలలో రైల్వే స్టేషన్ ఏర్పాటు వంటి ప్రతిపాదనలు కేవలం కార్పొరేట్లకు ఊడిగం చేయడం కోసమేనని విమర్శించారు. రానున్న కాలంలో ప్రజాసమస్యలపై సీపీఐ సమరశీల పోరాటాలకు సిద్ధమవుతోందని, కూటమి సర్కార్ కార్పొరేటీకరణ విధానాలను ప్రజలలో ఎండగడతామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సహాయ కార్యదర్శులు బుగత అశోక్, అలమండ ఆనందరావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


