న్యూదిల్లీ: కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత, నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి సమన్లు జారీచేసింది. ఈనెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. విజయ్‌ను ఈనెల 12న సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. మంగళవారం మరోసారి రావాలని సీబీఐ సూచించినప్పటికీ… జన నాయగన్ సినిమా విడుదలతో పాటు సంక్రాంతి నేపథ్యంలో మరింత సమయం కావాలని విజయ్ కోరినట్లు తెలిసింది. గతేడాది సెప్టెంబరు 27న విజయ్ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటనపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. 12వ తేదీన దిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ ముందు విజయ్ హాజరయ్యారు. ఆయన విచారణ ఆరు గంటల పాటు సాగింది. ఈ కేసులో అనేక లోపాలు ఉన్నాయని టీవీకే ఆరోపించింది. ఘటన జరిగినప్పుడు అక్కడున్న పోలీసుల సంఖ్యపై ముఖ్యమంత్రి, డీజీపీ వేర్వేరు ప్రకటనలు చేశారని పేర్కొంది. జన నాయగన్ సినిమా విడుదల అంశం త్వరలోనే పరిష్కారమవుతుందని టీవీకే వెల్లడిరచింది.


