. ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీ
. ప్రాజెక్టు వేగవంతానికి సంయుక్త టాస్క్‌ఫోర్స్
. సీఎం రేవంత్‌తో యూఏఈ మంత్రి అబ్దుల్లా
. దావోస్ వేదికగా చర్చలు
విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కలిసి పనిచేద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అన్నారు. ప్రాజెక్ట్ వేగవంతమయ్యేందుకు సంయుక్త టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్‌తో తెలంగాణ కలిసి పనిచేసి గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పని చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచఈ అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక-2026 సదస్సులో భాగంగా దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ‘తెలంగాణ రైజింగ’ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్రంలో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీపై చర్చించారు. రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను వివరించారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ అభివృద్ధి అవకాశాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇది దేశంలోనే తొలి నెట్-జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. సుమారు 30 వేల ఎకరాల్లో విస్తరించే ఈ నగరంలో ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాస, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మారుబేని, సెమ్ కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని, ఇటీవలే రిలయన్స్ గ్రూప్ వంతారాతో ఫ్యూచర్ సిటీలో కొత్త జూ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం కుదిరిందని సీఎం తెలిపారÁT.
భాగస్వామ్యం పంచుకుందాం: గూగుల్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లలో భాగస్వామ్యం పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్ సదస్సు సందర్భంగా గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా (ఏపీఏసీ) అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వాతావరణంలో మార్పులు, వ్యవసాయంపై ప్రభావం, పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యలకు పరిష్కారాలపై సమగ్రంగా చర్చించారు. ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ఫ్యూర్, రేర్, అభివృద్ధి నమూనాను, హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రేవంత్ రెడ్డి వివరించారు. ట్రాఫిక్ కంట్రోల్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఇన్నోవేషన్‌కు మరింత మద్దతు వంటి రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను ప్రస్తావించారు. తొలి గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు గూగుల్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎరువుల అతివినియోగంతో వచ్చే సమస్యలపై రైతులకు అవగాహన కల్పించాలనే అంశంపై ప్రతినిధుల బృందం చర్చించింది. సమస్యల పరిష్కారానికి, సమస్యలు తలెత్తకుండా నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సంజయ్ గుప్తా మాట్లాడుతూ, తెలంగాణకు పూర్తి మద్దతు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విస్తృత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలాతో భాగస్వామ్యం, ఏఐ పాఠ్యాంశాల అమలు వంటివి ప్రస్తావించారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్, టీ-ఫైబర్ హైస్పీడ్ ఇంటర్నెట్ ఇస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


