104 సేవలపై ప్రజల్లో అసంతృప్తి, అధికారులపై నిరాశ
- 104 సేవల లక్ష్యం – భవిష్యత్తులో భరోసా కావాలంటే ప్రతి గ్రామానికి చేరాలి
- గ్రామాల వరకూ వెళ్లని వాహనాలు -సచివాలయాలకే పరిమితం
విశాలాంధ్ర – కనిగిరి: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన 104 మొబైల్ హెల్త్ సర్వీసులు నేడు అసలు ఉద్దేశం తప్పిపోయినట్లు కనిగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు చెబుతున్నాయి.
గ్రామాల వరకు చేరాల్సిన వాహనాలు సచివాలయాల వద్ద ఆగిపోతున్నాయి. ప్రజలకు నిత్యం అవసరమైన వైద్య సేవలు, పరీక్షలు, మందులు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- 104 సేవల లక్ష్యం – భవిష్యత్తులో భరోసా కావాలంటే గ్రామానికి చేరాలి.
104 హెల్త్ వాహనాలు ఒక మొబైల్ క్లినిక్ లాగా పనిచేసే విధంగా ప్రభుత్వం వాటిని రూపొందించింది. గ్రామాల్లోని దాదాపు ప్రతి కుటుంబానికి కనీసం నెలలో ఒకసారి వైద్య పరీక్షలు, జ్వర లక్షణాల పరిశీలన, డయాబెటిస్, బీపీ, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితి పరిశీలన, నిత్యవసర మందుల పంపిణీ వంటి 14 రకాల సేవలు అందించాలని ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతానికి కనిగిరి నియోజకవర్గంలోని వాస్తవ పరిస్థితి దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది.
- గ్రామాల వరకూ వెళ్లని వాహనాలు – సచివాలయాలకే పరిమితం.
వాస్తవంగా జరగాల్సిన సేవలు:
- వాహనం నేరుగా గ్రామానికి వెళ్లాలి.
- గ్రామంలో ఓపెన్ ప్రాంగణం లేదా స్కూల్ యార్డ్‌లో వాహనం నిలిపి ప్రజలకు పరీక్షలు నిర్వహించాలి.
- రోగి వివరాలు నమోదు చేసి, అవసరమైన పరీక్షలు చేసి, మందులు ఇవ్వాలి.
- ఆరోగ్య రికార్డులు భద్రపరచాలి.
కానీ ఇప్పుడు సేవలు అందిస్తున్న విధానం:
- వాహనం గ్రామాల వద్దకు వెళ్లడం లేదు.
- సచివాలయం వద్ద ఆగి, పరిమిత మందులతో ‘సిమ్‌బాలిక్ సేవ’లకే పరిమితం అవుతోంది.
- పరీక్షలు చేయకుండానే మందులు ఇచ్చేస్తున్న ఉదంతాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేటాయించిన రూ.3,22,359 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో రూ.19,264 కోట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్లో కేటాయించి ఆరోగ్య శాఖకు పెద్దపీట వేసామని చెబుతుంటే అధికారులు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తూ గ్రామాలలో కనీసం 104 వైద్య సేవలను కూడా సక్రమంగా అందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, అనిమియా వంటి వ్యాధులు విస్తరించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది మరింత సమస్యాత్మకంగా మారే అవకాశముంది. 104 సేవలు సక్రమంగా పనిచేస్తే ముందస్తు నివారణ సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుతం అది జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేశామని చెప్తుంటే అధికారులు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామానికి నెలలో కనీసం ఒకసారి 104 వాహనం రావాలని, వైద్యుల పర్యవేక్షణ, అవసరమైన మందులు, పరికరాలు అందుబాటులో ఉండాలని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం, ముందస్తు వైద్య సేవలపై సంబంధిత వైద్య శాఖ అధికారులు, జిల్లా పరిపాలన యంత్రాంగం తక్షణమే స్పందించి గ్రామాలకు వైద్య సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


