కూటమి ఎమ్మెల్యేల వసూళ్లపర్వం : రామకృష్ణ
విశాలాంధ్ర-ఆలూరు : మాజీముఖ్యమంత్రి జగన్ బాటలోనే సీఎం చంద్రబాబు నడుస్తున్నారని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టి… యోగా బాట పట్టారన్నారు. ఆలూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ అధికారం చేపట్టిన కొత్తలో కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లో ఇప్పుడు ఆ ఉత్సాహం కనిపించడం లేదన్నారు. సొంత పార్టీనే మరచి సనాతన ధర్మం అంటూ రాష్ట్రాల చుట్టూ తిరగడమే పవన్‌కు సరిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి విశృంఖలంగా పెరిగిపోయిందని, ప్రభుత్వ శాఖల్లో లంచాలు లేనిదే పనులు జరగడం లేదని రామకృష్ణ విమర్శించారు. పోలీసు శాఖలో అవినీతికి అంతేలేదన్నారు. కూటమి ఎమ్మెల్యేలు ముడుపుల కోసం దుకాణాలు తెరిచారని విమర్శలు చేశారు. ఇంతజరుగుతున్నా చంద్రబాబు ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. ప్రజల మేలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయకపోతే కమ్యూనిస్టు పార్టీలుగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని, ప్రభుత్వాల వైఫల్యాలు ఎండగడతామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య, ఆవుల శేఖర్ పాల్గొన్నారు.


