Homeనిరుద్యోగ భృతి ఏదీ?

నిరుద్యోగ భృతి ఏదీ?

- Advertisement -

. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలి
. హామీలు అమలు చేయకుంటే ప్రత్యక్ష పోరాటం
. కలెక్టరేట్ల వద్ద ఏఐవైఎఫ్‌ నిరసనలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.3వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట సోమవారం ఏఐవైఎఫ్‌ నిరసనలకు దిగింది. నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే ప్రత్యక్ష పోరాటాలకు సన్నద్ధమవుతామని హెచ్చరించింది. ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగం, ఉపాధి కల్పించాలంటూ కలెక్టరేట్ల ఎదుట యువజన నేతలు నినదించారు. ప్రభుత్వం యువతను మోసగిస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌ దగ్గర నిరసనకు ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మోజ్జాడ యుగంధర్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోశ్‌, కొన్న శ్రీనివాస్‌ నాయకత్వం వహించారు. అనంతపురం కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో రాష్ట్ర ఆర్గనైజేషన్‌ కార్యదర్శి గండాల సంతోశ్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు ధనుంజయ్‌, దేవేంద్ర, శ్రీనాథ్‌, కార్యదర్శులు ఆనంద్‌బాబు, రాంబాబు, కర్నూలులో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్‌, నంద్యాలలో రాష్ట్ర సహాయ కార్యదర్శి బీ నాగరాముడు, తిరుపతిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కత్తి రవి, ఒంగోలులో రాష్ట్ర నాయకులు పోతుల ప్రభాకర్‌, జిల్లా అధ్యక్షులు ఆర్‌.కరుణానిధి, చిలకలూరిపేటలో రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్‌ సుబాని, కడపలో జిల్లా కార్యదర్శి పి.ప్రభాకర్‌, రాజమండ్రిలో జిల్లా ప్రధాన కార్యదర్శి త్రిమూర్తులు నాయకత్వం వహించారు. చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే స్పందించి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మొజ్జాడ యుగంధర్‌, పరుచూరి రాజేంద్రబాబు, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గండాల సంతోశ్‌కుమార్‌ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ..ఉద్యోగాల కోసం ఏ దేశాలకు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితిని యువతకు రానివ్వనని, ఇంటి దగ్గరే కూర్చుని పని చేస్తే (వర్క్‌ ఫ్రం హోం) లక్షలు సంపాదించేలా చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఐదేళ్లల్లో 20లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి.. అధికారంలోకి వచ్చి ఏడాది గడస్తున్నప్పటికీ ఈ ఏడాది ఇవ్వాల్సిన నాలుగు లక్షల ఉద్యోగాలు ఎటుపోయాయో చెప్పాలన్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ముసలి కన్నీరుకారుస్తున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగం, ఉపాధి అవకాశాల కల్పన కోసం ఏఐవైఎఫ్‌ ఆందోళన నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి జిల్లాలో ఐటీ పరిశ్రమలు, ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తామనే ప్రకటనలే తప్ప..వాటిని ఎక్కడా ఏర్పాటు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఫిబ్రవరిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ద్వారా నిర్వహించిన ‘స్కిల్‌ సెన్సెక్స్‌ సర్వే’లో 26 జిల్లాల్లో 2.67కోట్ల మంది దగ్గర వివరాలను సేకరించగా ఉపాధిలేని వారి సంఖ్య కోటిన్నర పైనే ఉందని, 18నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఏ ఉపాధి లేనివారు కోటి 56లక్షల మందిగా ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 7.52లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తేలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో దాదాపు 3.20లక్షల ఖాళీలపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియక కోటి ఆశలతో నిరుద్యోగ యువత ఎదురు చూస్తోందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు