. నాటుసారా తయారీని అరికట్టాలి
. నాణ్యమైన మద్యం బ్రాండ్లనే విక్రయించాలి
. పర్యాటక ప్రాంతాల్లో మైక్రో బ్రూవరీస్
. ఎక్సైజ్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు
. మళ్లీ పర్మిట్‌రూంలు… అధికారుల ప్రతిపాదన
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మద్యం విధానంలో పారదర్శకతే ప్రధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎలాంటి రాజీ లేదని ఆయన తేల్చి చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో అబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్రాండ్ల విక్రయాలన్నీ నిలిపివేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, నాణ్యత ఉన్న మద్యం విక్రయాలు మాత్రమే జరగాలని, ప్రజారోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని సీఎం స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటు సారా విక్రయాలు జరగడానికి వీల్లేదని, అటువంటివాటిని డ్రోన్ల సాంకేతికతతో నిరోధించాలని సూచించారు.
అలాగే పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో మైక్రో బ్రూవరీలను అనుమతించాలని, వైన్ షాపులకు పర్మిట్ రూమ్ లను అనుమతించే అంశంపై కమిటీ అధ్యయనం చేసిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పర్మిట్ రూంలు లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతున్నారని…ఇది సమస్యలకు కారణం అవుతుందని అధికారులు వివరించారు. దీన్ని నివారించేందుకు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నా…పూర్తి గా నివారించ లేకపోతున్నామన్నారు. అందువల్ల పర్మిట్ రూంలు ఇచ్చి…అక్కడి వరకే పరిమితం చేస్తే మంచిదని అధికారులు సీఎంకు వివరించారు.
మార్కెట్ లో ఉన్నవి ప్రముఖ బ్రాండ్లే
గత ప్రభుత్వ హయాంలో విక్రయించిన నకిలీ మద్యం బ్రాండ్లను ఎంత వరకు అరికట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగారు. గతంలో విస్తృత స్థాయిలో విక్రయించిన అనామక మద్యం బ్రాండ్లు నూతన పాలసీ అమలుతో పూర్తిగా తగ్గినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం దేశీయ, విదేశీ కంపెనీలకు చెందిన అన్ని ప్రముఖ బ్రాండ్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. గతంలో మార్కెట్లో 68 శాతం మేర అనామక బ్రాండ్లకు చెందిన మద్యమే అందుబాటులో ఉండేదని వెల్లడిరచారు. ప్రస్తుతం ఆ నాసిరకం బ్రాండ్ల విక్రయం జరక్కుండా చూస్తున్నామని అధికారులు సీఎంకు తెలియచేశారు.
పొరుగు రాష్ట్రాల కంటే తగ్గిన మద్యం ధరలు
నూతన మద్యం పాలసీ అమలు అనంతరం అబ్కారీ శాఖ చరిత్రలో తొలిసారి మద్యం ధరలు దిగి వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. గతంతో పోలిస్తే కనీసం రూ.10 నుంచి 100 రూపాయల వరకు ధరలు తగ్గినట్టు తెలిపారు. పేదల జేబులు కొల్లగొట్టేలా ప్రభుత్వం వ్యవహరించకూడదు, దోపిడీ ఉండకూడదు అనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం ధరలు తగ్గించామని సీఎం అన్నారు. ఈ కారణంగా ప్రతి నెలా కొనుగోలు దారులపై రూ.116 కోట్ల మేర భారం తగ్గుతుందని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా, కర్నాటక, తమిళనాడు తో పోలిస్తే ఏపీలో విక్రయిస్తున్న టాప్ 30 బ్రాండ్ల మద్యం ధరలు తక్కువగా ఉన్నాయని వివరించారు. బెల్లపు ఊట, నాటు సారా తయారీ లాంటి వాటిపై డ్రోన్స్ తో నిఘా పెట్టి… నియంత్రించాలని, డిజిటల్ ఆర్థిక లావాదేవాలను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
భారత్ నెట్‌తో ఫైబర్ నెట్ అనుసంధానం
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా 2014-19 మధ్య తీసుకువచ్చిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టును గత ప్రభుత్వ సర్వనాశనం చేసిందని, దీన్ని తిరిగి గాడిలో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై ప్రత్యేకంగా సమీక్షించిన సీఎం… ప్రజలకు, విద్యార్థులకు, ప్రభుత్వ విభాగాలకు ఉపయోగపడాల్సిన వ్యవస్థను గత ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం వాడుకుని ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. నాడు కేవలం 130 మంది ఉద్యోగులతో సంస్థను అద్భుతంగా నడిపాం. 8 లక్షలకు పైగా కనెక్షన్లు ఇచ్చాం.కానీ వైసీపీ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలకు ఉద్యోగుల కోసం సంస్థలో లేని పోస్టులు సృష్టించింది. 130 మంది ఉద్యోగులను 1,350కి పెంచి నిలువు దోపిడీకి పాల్పడిరదన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో వందల,వేల మందిని నియమించి…పార్టీ కోసం పని చేయించుకునే కొత్త తరహా అవినీతికి వైసీపీ పాల్పడిరది. ఈ తప్పులను సరిదిద్ది భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, 10 లక్షల వరకు కనెక్షన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భారత్‌నెట్ తో ఏపీ ఫైబర్ నెట్‌ను అనుసంధానించేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏపీ ఫైబర్ నెట్‌కు 2025 నుండి 2035 వరకు రూ.1,900 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు సీఎం వెల్లడిరచారు. అలాగే చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లోని 1,692 గ్రామ పంచాయతీల ఫైబర్ నెట్‌వర్క్‌ను లీనియర్ నుంచి రింగ్ ఆర్కిటెక్చర్‌కు మార్చేందుకు అంగీకారం తెలిపారు. అలాగే 480 కొత్త గ్రామ పంచాయతీలకు రింగ్ ఆర్కిటెక్చర్‌తో కనెక్టివిటీ కల్పిస్తారు. ఇందుకోసం మొత్తం రూ.430 కోట్లు కేంద్రం ఇస్తుంది. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఒక ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.


