Homeఆంధ్రప్రదేశ్మోదీ సర్కారు వైఫల్యం

మోదీ సర్కారు వైఫల్యం

- Advertisement -

‘డబుల్‌ ఇంజన్‌’తో రాష్ట్రానికి ఒరిగిందేమీలేదు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

. దేశసంపద బడాబాబులకు దోచిపెట్టడంలో సఫలం
. ఆర్థికస్థితిపై తప్పుడు ప్రచారం
. అప్పుల కోసమే చంద్రబాబు దిల్లీ పర్యటనలు
. ‘డబుల్‌ ఇంజన్‌’తో రాష్ట్రానికి ఒరిగిందేమీలేదు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర – విజయవాడ : దేశాన్ని ప్రగతిపథాన నడిపించడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, కేవలం విచ్ఛిన్న రాజకీయాలతోనే పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగర సమితి 24వ మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న చండ్ర రాజేశ్వరరావు కాంస్య విగ్రహానికి నగర కార్యదర్శి జీ కోటేశ్వరరావు, ఇరత నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్‌ సెంటర్‌ వరకు పార్టీ జెండాలు, నినాదాలతో కూడిన బ్యానర్లు చేతపట్టుకుని ఎర్ర దండు నిర్వహించిన భారీ ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. తొలుత ప్రజానాట్యమండలి నాయకులు ఆలపించిన విప్లవ గేయాలు ఆలోచింపజేశాయి. లెనిన్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడుతూ… దేశ ఆర్థిక పురోగతిపై ప్రధాని మోదీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. జపాన్‌తో పోల్చి ప్రపంచంలోనే ఆర్థిక వృద్ధిలో నాలుగవ స్ధానంలో ఉన్నామని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు ఒక్కటి కూడా మోదీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. 2కోట్ల మందికి ఉద్యోగావకాశాలు, విదేశీ బ్యాంకుల్లో నల్ల ధనం తీసుకువచ్చి ప్రజలకు పంచుతామ హామీల అమలు గాలికొదిలేశారన్నారు. మోదీ 11సంవత్సరాల పాలనలో అన్ని రంగాల్లోను విఫలం చెందారని కేవలం అదానీ, అంబానీలకు, కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడంలో సఫలం అయ్యారని పేర్కొన్నారు. దేశంలో 1శాతం ఉన్న బడాబాబుల చేతుల్లో 40శాతం సంపద ఉందని, 50శాతం ఉన్న ప్రజల వద్ద మాత్రం 3శాతం సంపద మాత్రమే ఉందన్నారు. కార్పొరేట్లకు మోదీ ఊడిగం చేయడం తప్ప దేశ ప్రజలకు చేసేందేమీ లేదన్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి లౌకిక రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేయడం, మనుస్మృతి విధానాలతో పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో అనేక కులాలు, మతాలకు చెందిన ప్రజలు ఐక్యంగా ఉన్నారంటే కేవలం బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగతోనే అని తెలిపారు. మోదీ, బాబు డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చేసిం దని… సంవత్సరం కాలంలో చంద్రబాబు దిల్లీకి 21సార్లు వెళ్లడం జరిగిందని… కేవలం అప్పులు కోసమే ఈ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల దిల్లీ పర్యటనలో కేంద్రమంత్రుల్ని కలిసి రూ.3600కోట్లు అప్పు తేవడంలో చంద్రబాబు విజయవంతమయ్యారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో పెండిరగ్‌లో ప్రాజెక్టులను ప్రక్కన పెట్టి బసకచర్ల ప్రాజెక్టు నిర్మాణం అంశాన్ని తెర మీదకు తీసుకురావడాన్ని తప్పుబట్టారు. అపరేషన్‌ బుడమేరు అంశాన్ని విస్మరించారని, పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడం సరికాదన్నారు. అమరావతి రాజధాని పేరుతో ఇప్పటికే రైతుల నుంచి 56వేల ఎకరాలు తీసుకున్నారని, భూములు ఇచ్చిన వారికి న్యాయం జరగలేదన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం కోసం మరో 40వేల ఎకరాలు భూ సేకరణ, మెట్రో రైలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. సంవత్సరకాలంలో చంద్రబాబు చేసిందేమీ లేదని మోదీ మొప్పు కోసం యోగా ప్రాజెక్టును చేపట్టి సక్సెస్‌ అయ్యారని తెలిపారు. 20రోజుల పాటు అధికారులను ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శించారు. చంద్రబాబు కంటే మోదీ 100రెట్లు తెలివిగలవారని, యోగాను ఒలిపింక్స్‌లో చేర్చడానికి ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. బాబు మోదీ ఇరువురు ఒకర్నొకరు పొగుడుకోవడం తప్పితే రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారని అన్నారు. ప్రభుత్వ విధానాల్లో డొల్లతనాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లో తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చండీగఢ్‌లో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభలో మోదీ ప్రభుత్వ వినాశకర విధానాలపై చర్చించి… కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. ఆగస్టులో ఒంగోలులో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ పేదల సమస్యల పరిష్కారానికి పార్టీ అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. విజయవాడ నగరాభివృద్ధికి కమ్యూనిస్టులే కారణమన్నారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక దోపిడి యథేచ్ఛగా సాగుతోందని, మద్యం అమ్మకాలతో వచ్చిన డబ్బులతో మహిళలకు పథకాలు అమలు చేయడాన్ని తప్పుబట్టారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చేందిందని అన్నారు. ఈ మహాసభలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్‌ కోటేశ్వరరావు, ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌, సహాయ కార్యదర్శులు లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరావు తదితర నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు