. రెవెన్యూ లోటు భర్తీ చేయండి
. అమరావతికి రెండో విడత నిధులు గ్రాంటుగా ఇవ్వండి
. కేంద్ర ఆర్థికమంత్రికి సీఎం చంద్రబాబు వినతి
. ఏపీ క్రీడాభివృద్ధికి సహకరించండి
. క్రీడామంత్రి మాండవీయకు విజ్ఞప్తి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు అందించే ఆర్థిక సాయం పథకం ‘సాస్కి’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా రూ. 10,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. దిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు బుధవారం సీఎం బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో భేటీలు, నదీ జలాల వివాదాలపై తెలంగాణ సీఎంతో చర్చలు జరిపారు. నిర్మలా సీతారామన్‌తో భేటీ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం కోరుతూ వినతిపత్రం అందించారు. 16వ ఆర్థిక సంఘానికి రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వినతిని అంగీకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విభజన కారణంగా రాష్ట్రం ఇప్పటికీ ఆర్థిక వనరుల లోటును ఎదుర్కొంటోందని ఇబ్బందులను వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి మొత్తం రూ.79,280 కోట్ల నిధులు అవసరం కాగా, ప్రస్తుతం రూ.44,351 కోట్ల విలువైన పనులు ప్రారంభించామని నిర్మలా సీతారామన్‌కు సీఎం తెలిపారు. వీటికి సంబంధించి ఇప్పటికే రూ.26,000 కోట్ల నిధులు సమీకరించామని, ఇంకా నిధుల అవసరం ఉందని చంద్రబాబు వివరించారు. అమరావతికి రెండో విడతగా ఇచ్చే నిధులను గ్రాంటు రూపంలో ఇవ్వాలని కోరారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్న కేంద్రానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కృష్ణానదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని భేటీలో సీఎం వివరించారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనల్ని మంత్రిత్వశాఖకు పంపినట్టు సీఎం కేంద్రమంత్రికి తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ, కాకినాడలలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు వెల్లడిరచారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి రూ. 27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రూ.170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రూ.341 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని అన్నారు. రాయలసీమలోని తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రి కోరారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్దికి చర్యలు చేపట్టినట్టు సీఎం వెల్లడిరచారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియచేశారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు రూ.25 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.


