Homeవిద్యార్థిని మృతిపై నిరసన వెల్లువ

విద్యార్థిని మృతిపై నిరసన వెల్లువ

- Advertisement -

. ఒడిశాలో బీజేడీ ఆందోళనలు హింసాత్మకం
. బాష్పవాయు గోళాలు… జలఫిరంగుల ప్రయోగం
. ఇద్దరు మాజీ మంత్రులు సహా బీజేడీ నాయకులకు గాయాలు
. సీఎం మారీa… విద్యా మంత్రి రాజీనామాకు డిమాండ్‌

భువనేశ్వర్‌ : బీఈడీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఒడిశాలో నిరసనలు మిన్నంటాయి. బుధవారం భువనేశ్వర్‌లో బీజేడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన ప్రదర్శనలో పోలీసులతో జరిగిన ఘర్షణలో ఇద్దరు మాజీ మంత్రులు సహా అనేక మంది బీజేడీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. రాష్ట్ర సచివాలయం, లోక్‌ సేవా భవన్‌ ముట్టడికి యత్నించిన బీజేడీ కార్యకర్తలు, నాయకులను పీఎంజీ స్క్వేర్‌ సమీపంలో పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. నిరసనకారులు భద్రతా సిబ్బందితో ఘర్షణ పడటంతో పోలీసులు జనాన్ని చెదరగొట్టడానికి జల ఫిరంగులు, భాష్పవాయుగోళాలను ప్రయోగించారని , బీజేడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని నిరసన స్థలం నుంచి తరలించినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. ఘర్షణల్లో గాయపడిన వారిలో మాజీ మంత్రులు ప్రణబ్‌ ప్రకాష్‌ దాస్‌, ప్రీతి రంజన్‌ ఘరాయ్‌ ఉన్నారు. ఘరాయ్‌ను మొదట క్యాపిటల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి, తరువాత భువనేశ్వర్‌లోని ఉత్కల్‌ ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించినట్లు బీజేడీ కార్యకర్త తెలిపారు. దాస్‌ను చికిత్స కోసం ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. బాలసోర్‌ కళాశాల విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేడీ కార్యకర్తలు ఒడిశా అసెంబ్లీ వెలుపల పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఫకీర్‌ మోహన్‌ (అటానమస్‌) కళాశాలలో రెండవ సంవత్సరం బీఈడీ చదువుతున్న విద్యార్థిని, గత శనివారం క్యాంపస్‌లో తనకు తాను పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోవడం… తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఎయిమ్స్‌-భువనేశ్వర్‌లో మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఘటనపై రాష్ట్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వాన్ని బీజేడీ దుయ్యబట్టింది. బీజేడీ ఉపాధ్యక్షుడు దేవి ప్రసాద్‌ మిశ్రా, మరో నేత స్నేహంగిని చురియా మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో న్యాయం కోరుతూ ఒక బాలిక మరణించింది. ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్‌ మంత్రులకు తమ రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియదు. ముఖ్యమంత్రి, ఎంపీ, ఇతరులు రాజీనామా చేయాలి. ఈ కేసుపై న్యాయ విచారణ జరపాలి. న్యాయం జరిగే వరకు మేము మా నిరసనను కొనసాగిస్తాము’ అని స్పష్టం చేశారు. ఈ సమస్య రాజకీయాలకు అతీతంగా, ప్రాథమిక మానవ హక్కులకు సంబంధించినదని నొక్కి చెబుతూ… తమ డిమాండ్లను పరిష్కరించకపోతే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని బీజేడీ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.
బాధితురాలికి తండ్రికి రాహుల్‌ పరామర్శ
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బుధవారం బాధితురాలి తండ్రితో మాట్లాడారు. న్యాయంకోసం వారి ప్రయత్నాలలో సంఫీుభావం తెలిపారు. ‘ఒడిశాలోని బాలాసోర్‌లో న్యాయం కోసం పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతురాలైన కుమార్తె తండ్రితో మాట్లాడాను. అతని గొంతులో… అతని కుమార్తె బాధ, కలలు, పోరాటాన్ని నేను అనుభవించాను. కాంగ్రెస్‌, నేను ప్రతి అడుగులోనూ వారితో ఉంటామని అతనికి హామీ ఇచ్చాను’ అని రాహుల్‌ ‘ఎక్స్‌’ పోస్ట్‌లో పేర్కొన్నారు.
బంద్‌తో బాలసోర్‌లో స్తంభించిన జనజీవనం
విద్యార్థిని మృతికి నిరసనగా బాలాసోర్‌లో బీజేడీ నిర్వహించిన ఎనిమిది గంటల బంద్‌ విజయవంతమైంది. మార్కెట్లు, పాఠశాలలు, కళాశాలలను స్వచ్ఛందంగా మూసివేశారు. వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో బాలసోర్‌ జిల్లాలో సాధారణ జీవనం స్తంభించింది. నిరసనకారులు టైర్లు తగలబెట్టి ప్రధాన రహదారులను దిగ్బంధించారు. జలేశ్వర్‌, బస్తా, సోరో, బలియాపాల్‌, భోగ్రై అంతటా ప్రదర్శనలు చేశారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కళాశాల ప్రిన్సిపాల్‌, నిందితుడైన ప్రొఫెసర్‌ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే న్యాయ విచారణకు ఆదేశించి విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగుతాయని బీజేడీ తన వైఖరిని పునరుద్ఘాటించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు