Home‘సర్వీస్‌ రూల్స్‌’ శాపం!

‘సర్వీస్‌ రూల్స్‌’ శాపం!

- Advertisement -

కష్టపడి పని చేసినా ఉద్యోగులకు దక్కని ఫలితం
. వేతనాలపై సుప్రీంకోర్టు తీర్పు బేఖాతరు
. మార్గదర్శకాలతో లైన్‌మెన్లకు చేటు
. ఆందోళనలు పట్టించుకోని విద్యుత్‌ సంస్థ
. శ్రమదోపిడీకి గురవుతున్న కాంట్రాక్టు కార్మికులు

విశాలాంధ్ర-సచివాలయం: విద్యుత్‌ శాఖ కార్యాలయాల్లో దీర్ఘకాలంగా పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా కనీస వేతనాలు అమలుకాని పరిస్థితి ఏర్పడిరది. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ విద్యుత్‌శాఖ యాజమాన్యం అమలు చేయకపోవడంతో వీరు ఆందోళన చెందుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం అనేక పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా యాజమాన్యం నుంచి సరైన సమాచారం రాకపోవడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ రంగ సంస్థలు అయిన ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఎస్‌ఓసీఎల్‌ కంపెనీలలో రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. ఏళ్ల క్రితం నాటి సర్వీస్‌ రూల్స్‌ వారి పాలిట శాపంగా మారుతున్నాయి. దశాబ్దాల క్రితం నిబంధనలు నేటికీ అమలు చేయడంతో తీవ్ర పని భారంతో విద్యుత్‌ లైన్‌మెన్లు సతమతమవుతున్నారు. ఓ వైపు కనెక్షన్ల భారం పెరగడం, మరోవైపు నిత్యం నిర్వహణ పనులు నిర్వహించడం వారికి కష్టంగా మారింది. దీంతో ప్రైవేట్‌ వ్యక్తులను నియమించుకొని పనులు చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. పదోన్నతులకు అవకాశం లేకపోవడంతో ఒకే హోదాలో ఏళ్ల తరబడి మగ్గిపోవాల్సిన దుస్థితి నెలకొంది. శాశ్వత ఉద్యోగులుగా మార్చాలంటూ అనేక పర్యాయాలు ఆందోళనలు చేసి ప్రభుత్వం, యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే… హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో అమలు చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంధన శాఖలో 1980లో రూపొందించిన సర్వీస్‌ రూల్స్‌ నేటికీ అమలు చేస్తుండడంతో ఉద్యోగులపై పని భారం పెరుగుతోంది. అప్పటి కనెక్షన్ల పరిస్థితులను అనుసరించి మార్గదర్శకాలను రూపొందించింది. నేటికీ వాటినే అమలు చేస్తుండడంతో లైన్‌మెన్లకు నష్టం వాటిల్లుతోంది. ఒక లైన్‌ మెన్‌ కింద 1,500 కనెక్షన్లు ఉండడంతో వీరిపై ఒత్తిడి పెరుగుతోంది. లైన్‌మాన్‌ కింద ఒక అసిస్టెంట్‌ లైన్‌మాన్‌, జూనియర్‌ లైన్‌మాన్‌ (జేఎల్‌ఎం గ్రేడ్‌-2 ) విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఆయా సర్కిళ్ల పరిధిలో పనిభారం ఎక్కువగా ఉండడంతో ఏఎల్‌ఎంలు నిర్వహణ పనులు చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో లైన్‌మెన్‌లు తమ పనులను సైతం జేఎల్‌ఎంలతోనే చేయిస్తుండడంతో వీరి పనికితోడు అదనపు పనులు కూడా చేయాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లైన్‌మెన్‌లు ఎక్కువగా ప్రైవేట్‌ వ్యక్తుల పైనే ఆధారపడాల్సి వస్తోంది. లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫోర్‌మెన్‌ వరకు పదోన్నతులు గ్రేడుల వారీగా జరగాల్సి ఉన్నా ఆ విధంగా జరగడం లేదని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. గతంలో ఫోర్‌మెన్‌ విభాగంలో ప్రతి రెండేళ్లకో ప్రమోషన్‌ చానల్‌ ఉండేది. అయితే ప్రస్తుతం ఒక్కో పోస్టులో ఐదేళ్లు పని చేయాల్సి రావడంతో పదోన్నతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. దీనికితోడు పై పోస్టుల్లో ఖాళీలు కాకపోవడంతో ఏళ్ల తరబడి ఒకే పోస్టులో పని చేయాల్సి వస్తోందని జేఎల్‌ఎంలు, ఏఎల్‌ఎంలు, లైన్‌ మెన్‌లు ఆవేదన చెందుతున్నారు. కాగా అనేక మంది లైన్‌ మెన్లు జేఎల్‌ఎంలతో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్‌ వ్యక్తులతో పనులు చేయిస్తున్నారు. ఎంతో ప్రమాదకరమైన స్తంభాలు సైతం ఎక్కిస్తుండటంతో వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంధన శాఖ నిబంధనల ప్రకారం లైన్‌మెన్‌లు విద్యుత్‌ స్తంభాలు ఎక్కాల్సి ఉన్నా ఎక్కడా నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రైవేట్‌ వ్యక్తులు సరైన జాగ్రతలు తీసుకోకుండా స్తంభాలు ఎక్కిన సందర్భంలో సిబ్బంది నిర్లక్ష్యంతో కూడా ప్రాణాలు పోయిన సంఘటనలు సైతం అనేకం ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి సచివాలయంలో ఒక ఎనర్జీ అసిస్టెంట్‌ (జేఎల్‌ఎం గ్రేడ్‌-2) ను నియమించింది. వారు లేని చోట ఏఎల్‌ఎం, లైన్‌ మెన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ వారిలో ఎవరో ఒకరు ఆ బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వాటిని సిబ్బంది బేఖాతరు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టు కార్మికులుగా 20 ఏళ్ల క్రితం చేరిన ఉద్యోగులకు కూడా కనీస వేతనాలు అమలు కాకపోవడంతో కుటుంబ పోషణ కష్ట తరంగా మారింది. ఒక వైపు సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాలను ఆదేశించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పని చేస్తే తమను శాశ్వత ఉద్యోగులుగా మారుస్తారన్న నమ్మకంతో ఏళ్ల తరబడి పని చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటున్నారు. పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు ఒకే విధమైన పనులు చేస్తున్నా వేతనాల్లో భారీగా వ్యతాసాలు ఉండడం, మరో వైపు బీమా సౌకర్యం అంతంత మాత్రంగా ఉండటంతో కార్మికుల్లో మరింత ఆందోళన నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు