బంగాళాఖాతంలో ఆవర్తనం
22వరకు కోస్తా, రాయలసీమకు వర్షసూచన
వాతావరణశాఖ వెల్లడి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థి తులు నెలకొన్న నేపథ్యంలో వాతావరణ శాఖ వానకబురు మోసుకొచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడిన ఫలితంగా ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రుతుపవన ద్రోణి ఎక్కువ రోజులు మధ్య, తూర్పు, వాయువ్య భారతంలో ఉండిపోగా, ఉపరితల ఆవర్తనం ఈ నెల 18కల్లా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాకు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో 18వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరుగుతాయని, ఈ నెల 22 నాటికి ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాతంలోకి వచ్చిన తరువాత అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఫలితంగా ఈ నెల 22 వరకూ కోస్తా, సీమలో వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అధికారులు వెల్లడిరచారు.
రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
వాతావరణశాఖ వర్షసూచన నేపథ్యంలో రైతుల్లో సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. జులై 15వ తేదీ వచ్చినా ఇప్పటికీ సరైన వర్షాలు పడకపోవడంతో విత్తనాలు కూడా చల్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ప్రతిరోజు ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురు చూసు ్తన్నారు. మేఘాలు ఊరిస్తున్నాయి తప్ప వానలు మాత్రం కురవడం లేదు. పైగా ఉష్ణోగ్రతలు వేసవి మరిపించే విధంగా ఎండలు మండిపో తున్నాయి. ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంటోంది. విచిత్ర వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నెల్లూరులో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు దాకా వడగాడ్పులు కూడా వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4నుంచి 8డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా నెల్లూరు లో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గన్నవరంలో 39.6, నరసాపురంలో 39.4, జంగమహేశ్వరపురంలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూలైలో 40 డిగ్రీలు నమోదు అవుతుండడంతో, ఎండ, ఉక్కు పోత వాతావరణానికి ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, రైతులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచన రైతుల్లో సాగుపై ఆశలు రేపుతోంది.


