Homeసీమలో ప్రతి ఎకరాకునీళ్లిస్తాం

సీమలో ప్రతి ఎకరాకునీళ్లిస్తాం

- Advertisement -

. తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునే వైఖరి
. నదుల అనుసంధానంతో కరువుకు చెక్‌
. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
. హంద్రీనీవా కాల్వలకు నీటి విడుదల

విశాలాంధ్ర బ్యూరో – నంద్యాల : రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎం పర్యటించారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా మల్యాల పంపింగ్‌ స్టేషన్‌ నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేశారు. తద్వారా శ్రీశైలం బ్యాక్‌వాటర్స్‌ నుంచి కృష్ణా నది జలాలను రాయలసీమ జిల్లాలకు తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. హంద్రీనీవా ఫేజ్‌-1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో నీరు విడుదల చేశారు. జలహారతి ఇచ్చి జిల్లాలోని నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్‌ స్టేషన్‌లో మూడు మోటార్లను ఆన్‌ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. 12 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. జలవనరులశాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు. ప్రాజెక్టు అలైన్‌మెంట్‌, ఆయకట్టు, కృష్ణా రివర్‌ బేసిన్‌ మ్యాప్‌లను పరిశీలించారు. పంపింగ్‌ స్టేషన్‌ వ్యూపాయింట్‌ నుంచి నీటి విడుదలను వీక్షించారు. అనంతరం రైతులతో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్స్‌ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు, రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. తిరుపతి వద్ద గాలేరు-నగరి, హంద్రీ నీవా, సోమశిల-స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. నిన్ననే దిల్లీలో నీటి వివాదాలపై చర్చలు జరిగాయని, తెలంగాణతో గొడవలు పడాల్సిన అవసరం లేదని… ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిద్దామన్నారు. శ్రీశైలం ప్లంజ్‌ పూల్‌ పనులకు మనమే డబ్బులిచ్చి పనులు చేస్తామన్నారు. అవసరమైతే గోదావరి నీళ్లు వాడుకోమని తెలంగాణకు చెప్పానని, నదుల అనుసంధానానికి సహకరించమని కోరానని,వేదవతిని పూర్తి చేస్తే ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలకు ఉపయోగపడుతుందని, వాటి పనులు పూర్తి చేస్తామన్నారు. అలగనూరు బండ్‌ 2021లో దిగిపోతే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, రూ.36 కోట్లు మంజూరు చేసి పూర్తి చేస్తామన్నారు. ఇక్కడి నుంచి చిత్తూరుకు నీళ్లు వెళ్లాలని, అడవిపల్లి రిజర్వాయర్‌ పూర్తి చేసి బ్రాంచ్‌ కెనాల్‌కు నీళ్లు తీసుకెళ్తామన్నారు. ఈ ఏడాది ఏ విధంగా కుప్పంకు నీళ్లు వెళ్తున్నాయో, వచ్చే ఏడాది చిత్తూరుకు నీళ్లు అందిస్తామన్నారు. సమస్య ఎదురైతే సవాలుగా తీసుకుని పని చేసే మనస్తత్వం తనదని, అ రాయలసీమ రైతుల కుటుంబాల్లో మార్పు రావాలనేదే తన లక్ష్యమన్నారు. హంద్రీనీవా నీటితో ప్రయోజనం పొందే రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాయలసీమకు నీరిచ్చానన్న తృప్తి ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. రాయలసీమను రతనాలసీమ చేస్తామనే ధైర్యమొచ్చిందని చెప్పారు. తాను రాయలసీమలోనే పుట్టి పెరిగానని… ఈ ప్రాంత కరువు కష్టాలు, ప్రజల బాధలు తనకు తెలుసన్నారు. అనంతపురంలో కరువు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తమదన్నారు. రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. సీమ చరిత్రను తిరగ రాయాలని హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే అన్నారు. హంద్రీనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెబుతూ… మల్యాల ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు తీసుకెళ్లవచ్చని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లపాటు ఒక్క గుంత కూడా పూడ్చలేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఆర్‌అండ్‌బీ రోడ్లను అందంగా మారుస్తామని చెప్పిన ప్రతిమాట నిలబెట్టుకున్నానని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఒకేసారి రూ.వెయ్యి పెంచి పింఛను ఇచ్చామని… దివ్యాంగుల పింఛను ఒకేసారి రూ.6 వేలకు పెంచిన ఘనత తమదేనన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నామని, 207 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. ‘‘నేను వచ్చాక 21 దేవాలయాల్లో అన్నదానం ప్రారంభించా. ఐదేళ్లపాటు ఒక్క టీచర్‌ పోస్టును భర్తీ చేయలేదు. టీచర్‌ లేకుండా పిల్లలకు చదువు ఎలా వస్తుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. వేరే రాష్ట్రానికి పోతున్న కియాను అనంతపురం తీసుకొచ్చామని గుర్తు చేశారు. 8 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియాకు నీళ్లు ఇచ్చిన ఘనత తమదన్నారు. రాష్ట్రానికి పేరు రావాలని, ప్రజల జీవితాలు బాగుపడాలని నిత్యం కోరుకుంటానని తెలిపారు. వైఎస్సార్సీపీ రాయలసీమకు రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తమ ప్రభుత్వమే అని చంద్రబాబు తెలిపారు. తమ హయాంలోనే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, గండికోట వచ్చాయన్నారు. నదులు అనుసంధానం జరగాలనేది తన జీవిత ఆశయమన్నారు. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరువు అనే మాటే ఉండదన్నారు. ఇప్పుడు రాయలసీమలోని అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయని తెలిపారు. నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రాయలసీమకు ఏ సీఎం చేయని ద్రోహం జగన్‌ చేశారన్నారు. ఐదేళ్లలో జగన్‌ చేయలేని పనిని ఏడాదిలోనే చంద్రబాబు చేసి చూపించారని తెలిపారు. హంద్రీనీవాకు నీరు ఇస్తామన్న మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం తమదన్నారు. హంద్రీనీవాకు రూ.3,890 కోట్లు ఖర్చుపెట్టి 8 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ, రాయలసీమలో అరాచకం సృష్టించాలని మాజీ సీఎం జగన్‌ చూస్తున్నారని మండిపడ్డారు. మన జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. బనకచర్లపై జగన్‌ మాటలను చరిత్ర క్షమించదన్నారు. కేవలం 100 రోజుల్లోనే హంద్రీనీవా కాల్వ సామర్థ్యాన్ని 12 పంపులకు పెంచామని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ హయాంలో గంప మట్టి కూడా తీయలేని పరిస్థితి నెలకొందన్నారు. జగన్‌ మళ్లీ పాలెగాళ్ల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. రాయలసీమను అభివృద్ధి చేసింది టీడీపీ పార్టీయే అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బీసీ జనార్దన్‌ రెడ్డి, ఎన్‌ఎండి ఫరూక్‌, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గిత్త జయసూర్య, బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, భూమా అఖిలప్రియ, జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, జిల్లా అధికారులు, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ అదిరాజ్‌ సింగ్‌ రాణా ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు