. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు
. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు అందజేస్తాం
. నిజాం కళాశాల పూర్వ విద్యార్థిగా గర్వంగా ఉంది
. ‘లింగ సమానత్వ’ సదస్సులో భట్టి
విశాలాంధ్ర – హైదరాబాద్ : మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే లింగ వివక్ష ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిజాం కళాశాలలో మహిళా కమిషన్ అధ్వర్యంలో గురువారం ‘లింగ సమానత్వం’పై సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భట్టి మాట్లాడుతూ… కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఏడాది మహిళా సంఘాలకు రూ.20వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు వివరించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా మొదటి ఏడాదిలోనే రూ. 21,632 కోట్లు వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేశామని వివరించారు. ఐదేళ్లకాలంలో రూ.లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలోని మహిళల చేతికి చేరితే ఆర్థిక స్వాతంత్య్రం, లింగ సమానత్వం సాధ్యమవుతుందన్నారు. విద్యార్థినిలు బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. నిర్మాణ, విద్యుత్ రంగాల్లో కొద్ది మంది ప్రైవేటు వ్యక్తులే విజయం సాధిస్తారని ప్రచారంలో ఉందని, కానీ అందుకు భిన్నంగా గ్రీన్ పవర్ ఉత్పత్తిలో భాగంగా మహిళా సంఘాలతో 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారితో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయిస్తామన్నారు. ప్రభుత్వమే విద్యుత్తు కొనుగోలు చేసి బిల్లులు చెల్లిస్తుందని ఆ మేరకు విద్యుత్ సంస్థలు… మహిళా సంఘాలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని వివరించారు. మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, దీని ద్వారా మహిళలపై ఆర్థిక భారం లేకుండా గుడి, బడి, ఆసుపత్రి తిరగడానికి అవకాశం ఏర్పడిరదన్నారు. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాల ద్వారా 650 బస్సులు కొనుగోలు చేయించి ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇప్పించి ఆదాయం వచ్చేలా ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. అమ్మ క్యాంటీన్లు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులు, ఇందిరమ్మ ఇళ్లు … ఇలా అన్నీ మహిళల పేరునే మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. మహిళలకు ఆత్మగౌరవం, లింగ సమానత్వం, వరకట్న నిషేధం, తల్లిదండ్రుల ఆస్తిలో వాటా హక్కులు దక్కాయి అంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. 1880లో ప్రారంభించిన నిజాం కళాశాల చాలా గొప్పదని, ఈ రాష్ట్రం, దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి గొప్ప సైంటిస్టులను, రాజకీయ నాయకులను, పరిపాలకులను అందించిందని వివరించారు. 2010-14 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో సీఎం గా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్‌గా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్, తాను నిజాం కళాశాల విద్యార్థులం కావడం గర్వకారణమన్నారు. నిజాం కళాశాల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు.


