స్థిరమైన, సమగ్ర ఇంధన అభివృద్ధికి కృషి: మంత్రి శ్రీధర్ బాబు
విశాలాంధ్ర – హైదరాబాద్: భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నడిపించడంలో కేంద్ర, రాష్ట్రాల పరస్పర సహకారం అవసరమని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో న్యూదిల్లీలోని భారత మండపంలో గురువారం ‘ఉర్జా మంథన్ 2025’ కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో భారతదేశ ఇంధన భద్రత, సహకార విధానాలపై చర్చ జరిగింది. దేశంలో 22 రాష్ట్రాల నుంచి మంత్రులు హాజరై తమతమ అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ నుంచి హాజరైన మంత్రి శ్రీధర్ బాబు … తెలంగాణ నాయకత్వాన్ని కీర్తిస్తూ… రాష్ట్ర క్లీన్, గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 కింద తీసుకున్న కీలకమైన చర్యలను వివరించారు. బయో ఇంధనాలు, కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ), సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్‌లపై దృష్టి సారించి ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నగరమే కాకుండా… ద్వితీయ శ్రేణి పట్టణాలలో సీజీడీ నెట్‌వర్క్‌లను వేగవంతం చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రవ్యాప్తంగా సమానమైన ఇంధన లభ్యతను పెంచాలని అభిప్రాయపడ్డారు. సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను పెంచాలన్నారు. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్‌లో పెట్టుబడులను పెంచి తద్వారా తెలంగాణలో పట్టణ, సెమీ అర్బన్ పైప్డ్ గ్యాస్ మౌలిక సదుపాయాల విస్తరణకు వీలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. పెరుగుతున్న పారిశ్రామిక, దేశీయ అవసరాలను తీర్చడానికి తెలంగాణలో సీఎన్జీ, ఎల్ఎన్జీ టెర్మినల్స్‌ను స్థాపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల వినియోగాన్ని మంత్రి ప్రతిపాదించారు. తెలంగాణలో గణనీయమైన కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి ఉపయోగించని సామర్థ్యాన్ని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం వీటిలో పెట్టుబడి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సీబీజీ, వ్యర్థాల నుంచి శక్తి సాంకేతికతలు, వ్యవసాయ సంపన్న ప్రాంతాలలో కొత్త సీబీజీ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. సాటాట్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి పథకాల కింద… క్లీన్ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలను పెంపొందించడానికి ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందించాలని పేర్కొన్నారు. తూర్పు-పశ్చిమ గ్యాస్ పైప్‌లైన్ వెంబడి… తక్కువ ఖర్చుతో గ్యాస్ ఆధారిత ఇంధన పారిశ్రామిక వినియోగాన్ని పెంచడానికి మౌలిక సదుపాయాలను విస్తరించడంలో కేంద్రం నేతృత్వంలోని మరిన్ని పెట్టుబడులను ప్రతిపాదించారు. ఇంధన రంగంలో దేశంలో కీలక భాగస్వామిగా తెలంగాణ స్థిరమైన, సమగ్ర ఇంధన అభివృద్ధికి జాతీయ నమూనాగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. ‘ప్రోయాక్టివ్ విధానాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక సంసిద్ధతతో, భారతదేశం క్లీన్ ఎనర్జీ పరివర్తనకు నాయకత్వం వహించడానికి తెలంగాణ సిద్ధంగా ఉంది’ అని అన్నారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి పాల్గొన్నారు.


