Sunday, July 20, 2025
Homeజిల్లాలుబాపట్లసింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా బాపట్ల

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా బాపట్ల

విశాలాంధ్ర – బాపట్ల : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు.

“స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ్ర” కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంతో కలిగే నష్టాన్ని వివరిస్తూ అవగాహన ర్యాలీని శనివారం స్థానిక బాపట్ల పట్టణంలో నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ప్రాణాంతకం, భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతిని ప్రేమిద్దాం- పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ విద్యార్థులు పెద్దపెట్టున నినదించారు. ర్యాలీలో 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా చెత్త డంపింగ్ యార్డు వద్దకు చేరుకున్న వేలాదిమంది విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై కలెక్టర్ స్వయంగా అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్ధాలతో పర్యావరణానికి కలిగే నష్టాన్ని వివరించారు. ఈ తరం ప్రజలు చేస్తున్న పొరపాట్లు రాబోయే తరాలకు నష్టాన్ని కలిగించరాదన్నారు. చెత్తతో భూమి, వాయువు, జలాలు కాలుష్యం గాకుండా ప్రజలు, పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. నేటి విద్యార్థులు చైతన్యంతో భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని కోరారు. భూమిలో కుళ్ళిపోయే వ్యర్ధాలు ఒక బుట్టలో, ప్లాస్టిక్ వ్యర్ధాలను వేరొక బుట్టలో వేసేలా మీ ఇంటి నుంచి వ్యర్థాలను విభజించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లా కలెక్టర్, బాపట్ల శాసనసభ్యులు కలసి పారిశుద్ధ్య కార్మికులను పుష్పమాలతో సత్కరించారు.

క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రకటించారు. ప్రమాదకరంగా మారుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించుకోవాలన్నారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు మార్గనిర్దేశం చేశామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమైనదనే విషయం ప్రజలు గుర్తించాలన్నారు. పశువులు, మత్స్య సంపద మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను 70 శాతం జిందాల్ కు తరలించామన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమంపై దృష్టి సారించామన్నారు. దశాబ్దాలుగా ప్లాస్టిక్ కవర్లు, సంచులు వినియోగించే అలవాటును ప్రజలు మార్చుకోవాలన్నారు. భావితరాల కోసం నేటి యువత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రకృతికి ఎలాంటి హానిలేని శ్రేయస్కరమైన గుడ్డ సంచులు, స్టీల్, కాగితపు గ్లాసులనే వాడాలన్నారు. ప్రకృతిని ప్రేమించే వారిగా నేటి విద్యార్థులు ఎదగాలని ఆయన సూచించారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రజలు పూర్తిగా నిలిపి వేయాలని బాపట్ల శాసనసభ్యులు విగేశన నరేంద్ర వర్మ తెలిపారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు బాపట్ల జిల్లాలో విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణలో జిల్లా కలెక్టర్ బాగా పనిచేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలు మరింత విస్తృతం కావాలన్నారు. ప్రజలు సుభిక్షంగా జీవించడానికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలను ప్రజలు గుర్తించి, నిలిపివేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలని ఆయన కోరారు. రానున్న తరాల కొరకు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాలను ఎవరు ఉల్లంఘించారాదన్నారు. ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలన్నారు. సమాజమే దేవాలయంగా భావిం చాలాన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలు, వినియోగం వద్దు బ్రో అంటూ విద్యార్థులకు సూచించారు.

కుళ్లిపోయే స్వభావం ఉన్న వాటిని, లేని వాటిని ఇంటి వద్ద నుంచి వేరు చేయాలని బుడ చైర్మన్ సలగాల రాజశేఖర్ బాబు తెలిపారు. ప్లాస్టిక్ పదార్థాలకు కుళ్లిపోయే స్వభావం లేనందున నష్టం అపారంగా ఉందన్నారు. నాగరికత మనిషి మనుగడకు ప్రమాదంగా మారిందన్నారు. వాటిని గుర్తించి, సమాజాన్ని కాపాడుకునేలా జాగ్రత్తగా మెలగాలన్నారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే పర్యావరణాన్ని పరిరక్షించుకోగలమని జిల్లా రెవిన్యూ అధికారి, పురపాలక సంఘం ప్రత్యేక అధికారి జి గంగాధర్ గౌడ్ తెలిపారు. మనం నివాసం నివసించే చుట్టూ పక్కల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మానవ మనుగడకు పెనుభూతంగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో డిపిఓ ప్రభాకర్ రావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఆర్డీవో గ్లోరియా, సిపిఓ షాలేమ్ రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు