బాపట్ల జిల్లా ప్రత్యేకాధికారి వేణుగోపాల్ రెడ్డి
విశాలాంధ్ర – బాపట్ల : లోతట్టు ప్రాంతాలలోని గర్భిణులను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ వైద్యశాలలకు తరలించాలని జిల్లా ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. గర్భిణీలకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు. 15 రోజుల్లో కాన్పు జరిగే 47 మంది గర్భిణులను ప్రభుత్వ వైద్యశాలలకు తరలించగా, మరో 87 మంది గర్భిణీలను ప్రైవేట్ వైద్యశాలలకు తరలించామన్నారు. లో తట్టు ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరాకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. విద్యుత్ నిలిస్తే ఆయా ప్రాంతాలలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. కండక్టర్లు సిద్ధంగా ఉంచామని, 152 విద్యుత్ పరివర్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 803 స్తంభాలు, 630 మంది విద్యుత్ సిబ్బంది ఆయా ప్రాంతాలలో సిద్ధంగా ఉంచామన్నారు. మొంథా తుపాను ప్రభావంతో నిరాశ్రయులైన వారిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. 119 పునరావాస కేంద్రాలకు 5,407 మంది నిరాశ్రయులను తరలించామన్నారు. పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించామన్నారు. ఆశ్రయం పొందుతున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అల్పాహారం, భోజనం సకాలంలో అందజేస్తున్నామన్నారు. వైద్య సదుపాయాలకు అన్ని సిద్ధంగా ఉంచామన్నారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే తక్షణమే సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. మొంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు రెండు గ్రామాలలో రహదారులు పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. బల్లికురవ మండలంలోని కొమ్మినేనివారి పాలెం గ్రామాల మధ్య రహదారిలో కల్వర్టు కుంగిందన్నారు. కారంచేడు మండలం కేశవరపాడు-తిమిడిపాడు ఆర్ అండ్ బి రహదారి 50 అడుగుల మేర ధ్వంసం అయిందన్నారు. ఆ మార్గంలో వాహనాలను దారి మళ్లించామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డి ఆర్ ఓ జి.గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీలు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు
- Advertisement -


