Homeసభ నడిపేది మీరా… అమిత్‌ షానా?

సభ నడిపేది మీరా… అమిత్‌ షానా?

- Advertisement -

. డిప్యూటీ చైర్మన్‌కు ఖడ్గే ప్రశ్న
. సభలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఉండటంపై ఆగ్రహం
. ప్రతిపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా

న్యూదిల్లీ : ప్రతిపక్షాల ఆందోళనలతో మంగళవారం కూడా పార్లమెంటు దద్దరిల్లింది. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఉండటంపై రాజ్యసభలో, ఎస్‌ఐఆర్‌ తదితర అంశాలపై లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగాయి. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొనడటంతో ఉభయ సభలు బుధవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళనలతో ప్రారంభమైన 30 నిమిషాల్లోనే లోక్‌సభ వాయిదా పడిరది. అటు రాజ్యసభలో ప్రతిపక్షాలు వర్సెస్‌ అధికార పక్షం పరిస్థితి నెలకొంది. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఉండటంపై రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖడ్గే మండిపడ్డారు. సభను నడిపేది చైర్మనా లేక అమిత్‌ షా అంటూ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ను ప్రశ్నించారు. వాళ్లు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కాదని, మార్షల్స్‌ అని హరివంశ్‌ వివరణ ఇచ్చారు. సభ భద్రత విధుల్లో ఉన్నది మార్షల్స్‌ మాత్రమేనని నొక్కిచెప్పారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, ముఖ్యంగా వెల్‌లోకి వెళ్లిన సందర్భాలను ఆక్షేపించారు. మైక్‌లో మాట్లాడుతున్న సభ్యుల వద్దకు వెళ్లి నినాదాలు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. సభ హూందతానికి విఘాతం కలిగించవద్దన్నారు. ఖడ్గే మాట్లాడుతూ ఉభయ సభల్లో ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహిస్తుండటం, ప్రతిపక్షాల గొంతును అణచివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించడాన్ని సమావేశాల్లో భాగంగా గతంలో సభాపతులు భావించేవారని, ప్రస్తుతం భిన్నపరిస్థితులున్నాయని దుయ్యబట్టారు. సభల్లో మాట్లాడడానికి కూడా ప్రతిపక్ష సభ్యులకు అవకాశం లేదన్నారు. ఇది తమ ప్రజాస్వామ్య హక్కులను హరించడమే అని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సూచనల ప్రకారం సభ నడుపుతున్నట్లుగా తోస్తోందని విమర్శించారు. సభను నడిపిస్తున్నది మీరా లేక అమిత్‌ షానా అని హరివంశ్‌ను ఖడ్గే నిలదీశారు. హరివంశ్‌ స్పందిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడి వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు మాట్లాడుతూ సభలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది లేరని, ఖడ్గే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ సభాపక్ష నాయకుడు జేపీ నడ్డా స్పందిస్తూ ప్రతిపక్షాల ఆందోళనలు అప్రజాస్వామికం… వారిది అరాచకత్వమని ఆరోపించారు. సభ గౌరవాన్ని, హూందాతనాన్ని కాపాడాలన్న సభాపతి ఆదేశాలతో సభలో ఉండే వారు మార్షల్‌ అని, పారామిలటరీ దళ సభ్యులు కాదని అన్నారు. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని సభలోకి తెచ్చారని, తమకున్న ప్రజాస్వామ్య హక్కులు వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు ఆందోళన, నినాదాలతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడిరది. తిరిగి సమావేశమైనప్పుడు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించే తీర్మానాన్ని, కస్టమ్స్‌ టారిఫ్‌ చట్టం`1975 రెండవ షెడ్యూల్‌ సవరణకు మూజూవాణి ఓటు ద్వారా ఆమోదించింది. అయితే నిబంధన 267 కింద వచ్చిన 34 వాయిదా తీర్మానాలను సభాపతి తిరస్కరించారు. అనంతరం రాజ్యసభ బుధవారానికి వాయిదా పడిరది. అటు పార్లమెంటు బయట ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు