96 డిస్పెన్షరీలు ఏర్పాటుకు సన్నాహాలు...
ఈఎస్ఐ అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
విశాలాంధ్ర`విజయవాడ: కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉండేందుకు రాష్ట్రంలో 7 నూతన వైద్యశాలలతోపాటు 96 డిస్పెన్షరీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. విజయవాడలోని ఈఎస్ఐ వైద్యశాల ప్రాంగణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో సీఎస్ఆర్ ఫండ్స్ తో కొనుగోలు చేసిన 2 అంబులెన్స్ లను మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఎస్ఐ వైద్యశాలల్లో 500 ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అలాగే వైద్యశాలల్లో వైద్య పరికరాల కోనుగోలుకు అనుమతులు వచ్చాయన్నారు. ప్యాక్టరీల్లో జీరో ప్రమాదాల నివారణకు కూటమి ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుందన్నారు. సేవలను మరింత విస్తృత పరచడంలో భాగంగా ఎస్బిఐ సహకారంతో సీఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. కొద్ద రోజుల క్రితం యూనియన్ బ్యాంక్ సహకారంతో రూ. 43 లక్షల విలువైన అంబులెన్స్ ను ఈఎస్ఐ వైద్యశాలకు అందించడం జరిగిందన్నారు. ఈ అంబులెన్స్ ల్లో వెంటిలేటర్, ఈసీజీ తదితర రోగికి అత్యవసర స్థితిని నుంచి రక్షించడానికి అవసరమైన అన్ని పరికరాలు ఏర్పాటు చేయడమైనదన్నారు. ప్రమాదకరమైన రసాయన కర్మాగారాల్లో రికార్డుల మూల్యాంకనం చేయడానికి పరిశ్రమల్లో విద్యార్థులకు ఇంటర్న్ షిప్ లు కల్పించడానికి, ప్యాక్టరీల్లో భద్రకు సంబంధించి విశ్వవిద్యాలయాల నుంచి సాంకేతిక సహకారం తీసుకునేందుకు జెఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీతో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎంఓయూ చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జి,కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరిబాబు, డైరక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ మోహనరావు, జెన్టీయూ-కాకినాడ రిజిస్ట్రార్ ఆర్. శ్రీనివాసరావు, ఎస్ బి ఐ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమతి. సీతాక్ష్షి సింగ్, ఈఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


