విశాలాంధ్ర – గుమ్మగట్ట : మండల పరిధిలోని భైరవాణితిప్ప ( బీటీపీ) ప్రాజెక్టులో ఇన్స్టాగ్రామ్ వీడియోలు తీయడానికివెళ్లి యువకుడు మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు,బంధువులు,మిత్రులు తెలిపిన వివరాల మేరకు రాయదుర్గం పట్టణంలోని కలేగార్ వీధికి చెందిన మహమ్మద్ ఫైజ్ (20) తన స్నేహితులతో కలిసి ఇన్స్టాగ్రామ్ వీడియోలు తీయడానికి బీటీపీ డ్యాం కు వెళ్ళాడు. అయితే బైరవానితిప్ప ప్రాజెక్టు ఇన్ ఫ్లో పెరగడంతో శనివారం అధికారులు ఆరవ గేట్ ఎత్తారు. ఆ నీటి ప్రవాహాన్ని ఒకరు చిత్రీకరిస్తుండగా ఇద్దరు యువకులు ఈత కొడుతూ గల్లంతయ్యారన్నారు.వారిలో ఒకరు బయటకు రాగా మరో యువకుడు మహమ్మద్ ఫైజ్ నీటిలో మునిగిపోయాడు. కాగా మత్స్యకారులు యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.సమాచారం తెలుసుకున్న ఫైజ్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు.ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


