వరి పంటలో తగు జాగ్రత్తలు ద్వారా నష్టాన్ని నివారించవచ్చు
విశాలాంధ్ర – సీతానగరం: తుపాన్ ప్రభావం వల్ల భారీ వర్షాల నేపథ్యంలో వరి పంట సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై ఏ డి ఏ శిశిబిందు క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించారు. మంగళవారం మండల వ్యవసాయ అధికారిని గౌరీ దేవి ఆధ్వర్యంలో కోరుకొండ ఏ డి ఏ శశిబిందు రఘుదేవపురం వ్యవసాయ క్షేత్రాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా శశిబిందు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి పంట 15.58 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతోంది. ప్రస్తుతం పంట పూత దశ, పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశ మరియు కోత దశలలో ఉందని అన్నారు. వరి పంటలో పొలంలో నీరు అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. అలగే నిలిచిన లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనపడితే, 5 శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాములు స్ఫటిక ఉప్పు / లీటరు నీటికి) కలిపి పిచికారీ చేయాలి. ఇది మొలకలు రంగు మార్పును తగ్గిస్తుంది. దానితో పాటు గింజలు రంగు మారటం, మాగుడు తెగులు, మానిపండు తెగులు వ్యాప్తి నివారించడానికి ఎకరాకు 200 మి.లీ. ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలని సూచించారు. రైతులు ఈ పద్ధతులను పాటించడం ద్వారా సాధ్యమైన అంత మేర నష్టాన్ని నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ గురుప్రియ, వి ఏ ఏ, రైతులు పాల్గొన్నారు.


