Homeఅసైన్డ్‌ భూములకు రెక్కలు

అసైన్డ్‌ భూములకు రెక్కలు

- Advertisement -

. బదిలీల నిషేధం చట్ట సవరణకు గ్రీన్‌ సిగ్నల్‌
. లక్ష కోట్ల ఎస్‌ఐపీబీ పెట్టుబడులకు ఆమోదం
. పార్టీ కార్యాలయాల లీజు 99 ఏళ్లకు పొడిగింపు
. ఉండవల్లి వద్ద మరో పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణం
. ఏపీపీఎఫ్‌సీఎల్‌కు 5 వేల కోట్ల రుణం
. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రెవెన్యూ శాఖలో 1977 నాటి అసైన్డ్‌ భూముల బదిలీల నిషేధం బిల్లును సవరించడానికి మంత్రివర్గం తీర్మానించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనిప్రకారం అవసరాల కోసం ఇకపై అసైన్డ్‌ భూములను కూడా 99 ఏళ్ల లీజుకు ఇవ్వనున్నారు. అలాగే ఇటీవల ఎస్‌ఐపీబీలో జరిగిన సమావేశంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన మంత్రివర్గ సమావేశం అజెండాలోని 70 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం సమావేశ నిర్ణయాలను సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. క్వాంటం కంప్యూటింగ్‌ సంస్థలు, సాంకేతిక నిపుణులు, క్వాంటం కంప్యూటింగ్‌ విడిభాగాల సంస్థలకు ఏపీ కేంద్రంగా మారబోతోందని మంత్రి చెప్పారు. ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడమే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ మిషన్‌ లక్ష్యమని, భారీగా స్టార్టప్‌లు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. 5 వేల మందికి పైగా నిపుణులు రాష్ట్రానికి రాబోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ అనుసంధాన స్పేర్‌ వర్క్‌ స్టేషన్లు ఏర్పాటుకు, ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వర్క్‌ స్టేషన్లను ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేస్తుంది. విశాఖలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్క్‌ ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. విశాఖలో రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటుతో పాటు రుషికొండ, కాపులుప్పాడలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే తిరుపతి, ఓర్వకల్లుతో వివిధ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఓర్వకల్లు డ్రోన్‌ సిటీలో 50 ఎకరాల్లో డెడికేటెడ్‌ డ్రోన్‌ ఇండస్ట్రియల్‌ ఏర్పాటు చేయనున్నారు. బిర్లా గ్రూప్‌నకు నెల్లూరులో ఫైబర్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం, ఓర్వకల్లులో సిగాచి ఇండస్ట్రియల్‌ లిమిటెడ్‌ సింథటిక్‌ ఆర్గానిక్‌ ప్లాంట్‌ కోసం 100 ఎకరాల భూమి, అనకాపల్లి జిల్లాలో డోస్కో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 150 ఎకరాల భూమి కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడులో 40 ఎకరాల్లో వేద ఇన్నోవేషన్‌ పార్క్‌ ఏర్పాటుకు, సుగుణ గ్రూప్‌ అధ్వర్యంలో అనంతపురంలో టీఎంటీ బార్స్‌ తయారు చేసే ప్లాంట్‌ కోసం 300 ఎకరాలు భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసైన్డ్‌ భూముల (బదిలీ నిషిద్ధ) చట్టం సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఇకపై అసైన్డ్‌ భూములను కూడా అవసరాల కోసం 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు వీలు కలుగుతుంది. కుప్పం, దగదర్తిలో విమానాశ్రయాల ఏర్పాటు కోసం వెయ్యి కోట్లు రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌కు సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి సమావేశం ఆమోదం తెలిపింది. అమరావతిలో ఉండవల్లి వద్ద మరో పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం ప్రపంచ బ్యాంక్‌, ఎడీబీ బ్యాంక్‌ ద్వారా రూ.595 కోట్లు రుణం తీసుకునేందుకు పరిపాలనాపరమైన అనుమతులకు ఆమోదం తెలిపింది. కృష్ణయ్యపాలెం, వెంకటపాలెం, పెనుమాకలో రోడ్లు, డ్రైనేజీలు, సదుపాయాల కల్పన కోసం రూ.1,863 కోట్లతో కాంట్రాక్ట్‌ ఇచ్చేందుకు, జీవిత ఖైదు పడిన ముగ్గురు ఖైదీలకు క్షమాబిక్ష ప్రసాదించే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సంతమాగలూరులో 1000 ఎకరాల స్థలంలో సోలార్‌ ప్లాంట్‌, కర్నూలు జిల్లా హోళగుంద, ఆలూరులో 2 మెగావాట్‌ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు, ఏపీపీఎఫ్‌సీఎల్‌కు అనేక సంస్థల ద్వారా 5 వేల కోట్ల రుణాలు పొందేందుకు, ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్‌ పార్క్‌ ఏర్పాటుకు భూమిని హ్యాండ్లూమ్‌ శాఖకు అద్దెకి ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఆర్థిక సాయం కింద పీఎం కిసాన్‌ కింద ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్రం ఇచ్చే రూ.14 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. తిరుపతి రూరల్‌ వావిలాల గ్రామంలో 2 ఎకరాలు, మచిలీపట్నం సమీపంలోని మాచవరంలో 1.60 ఎకరాల భూమిని కార్యాలయాల నిర్మాణానికి లీజు ఇచ్చేందుకు సమావేశం ఆమోదం తెలిపింది. అలాగే జాతీయ పార్టీలు, రాష్ట్రంలో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణానికి కొన్ని షరతులకు లోబడి ఇచ్చే భూమిని లీజు 33 నుంచి 66 లేదా 99 ఏళ్లకు పెంచే సవరణకు, విజయవాడ, విశాఖపట్నంలలో కొత్తగా ఏర్పాటయిన వస్తు, సేవల పన్ను అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ బెంచ్‌ కోసం 19 కొత్త పోస్టుల కల్పనకు చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్‌.విశ్వనాథన్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు