. నీటిపారుదల ప్రాజెక్టులపై సీతకన్ను
. వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడం దారుణం
. సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విశాలాంధ్ర – రాయచోటి రూరల్ : డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకోవడం మినహా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎన్నికైన సందర్భంగా స్థానిక ఎన్జీవో హోమ్‌లో ఆత్మీయ సమావేశం పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.మహేష్ అధ్యక్షతన సోమవారం జరిగింది. బంగ్లా సర్కిల్ వద్ద ఈశ్వరయ్యకు స్వాగతం పలికిన సీపీఐ శ్రేణులు…ఎన్జీవో హోమ్ వరకు ర్యాలీగా కొనసాగించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు, మహిళలకు నెలకు రూ.1500 హామీ గురించి కూటమి ప్రభుత్వం నోరువిప్పడం లేదన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు గురించి ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదన్నారు. రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎర్రచందనం ఎలా పండుతుందో శాస్త్రీయంగా తెలియ కుండా ప్రజలను మూఢవిశ్వాసంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో లేనప్పుడు సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడిన పవన్…ఈ కేసుపై ఇప్పుడెందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 30 వేల మంది మహిళల అక్రమ రవాణా అంశం గాలికిపోయిందన్నారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను కొర్పొరేట్ శక్తులకు, తమ అనుయాయులకు కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనివల్ల పేదలకు వైద్య విద్య దూరమవుతుందని ఈశ్వరయ్య ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టును సైతం పీపీపీ విధానంలో కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అన్నమయ్య జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని, హంద్రీనీవా ప్రాజెక్టును పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించాలని కోరినా చెవికెక్కడం లేదని, గాలేరు నగరి ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, అన్నమయ్య ప్రాజెక్టు గురించి చెప్పనవసరం లేదన్నారు. విభజన హామీలు సాధించ డంలో పూర్తిగా విఫలమైందన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనకు పరిమితమైందన్నారు. మరోపక్క మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను, మావోయిస్టులను చంపేస్తోందని ఈశ్వరయ్య విమర్శించారు. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్రం మావోయిస్టుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందన్నారు. నేపాల్ తరహా కమ్యూనిస్టుల పునరేకికరణ భారత్‌లోనూ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రత, సామాజిక న్యాయం కమ్యూనిస్టులతోనే సాధ్యమని స్పష్టంచేశారు. సీపీఐ శతవసంతాల వేడుక డిసెంబరు 26న ఖమ్మంలో నిర్వహిస్తున్నా మని తెలిపారు. జనగణనలో కులగణన నిర్వహించాలనే డిమాండ్‌తో ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థి ఉద్యమం నుంచి యువజన నేతగా, సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య ఎదిగిన వైనాన్ని, ఆయన పోరాట స్ఫూర్తిని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మ ణ్యం రాజు, మదన్మోహన్ రెడ్డి, పద్మ, విశ్వనాథ్, తోపు కృష్ణప్ప, టి.రాధాకృష్ణ, సిద్దిగాల శ్రీనివాసులు, ఎం.సాంబశివ, ఎం.శివరామ కృష్ణ దేవరా, కె.మురళి, ఎం.సుమిత్రమ్మ, జ్యోతి చిన్నయ్య, మనోహర్ రెడ్డి, టీఎల్ వెంకటేశ్, పి.కోటేశ్వరరావు వివరించారు. వంగిమల రంగారెడ్డి, శ్రీనివాసులు, విశ్వనాథ నాయక్, శంకు రవీంద్ర, లవకుమార్ తదితరులు ఈశ్వరయ్యను ఘనంగా సత్కరించారు. డి.రాజశేఖర్, జక్కల వెంకటేశ్, గంగాధర్, పోకూరు మురళి, సరోజనమ్మ, గాలి చంద్ర, సలీం భాష తదితరులు పాల్గొన్నారు.


