*రాష్ట్ర పండుగగా పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు*
*జిల్లా స్థాయిలో నవంబర్ 23 న జిల్లా నుంచి సచివాలయం స్థాయి వరకు ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు*
— జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
విశాలాంధ్ర – తూర్పుగోదావరి : ఆంధ్రసోరదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా వంద సంవత్సరాల పుట్టిన రోజు సందర్భంగా శతజయంతిని రాష్ట్ర పండుగగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖ, శ్రీ సత్య సాయి గురుకుల పాఠశాల, విద్యా శాఖ, సంగీత కళాశాల, సమాచార & పౌర సంబంధాల శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారు లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీ (ఆదివారం) శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలను జిల్లా, డివిజన్, నియోజకవర్గం, మునిసిపాలిటీ, మండల, సచివాలయ స్థాయిల్లో అధికారికంగా శత జయంతి నీ అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను నవంబర్ 19 నుండి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యున్నత స్థాయిలో నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా 23వ తేదీ న పుట్టపర్తి సత్య సాయి బాబా జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు అన్ని కేంద్రాల్లో తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. వాటికి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ యాలన్నారు. *కలెక్టర్ సూచించిన ముఖ్యాంశాలు* : శ్రీ సత్యసాయి బాబా జీవితం, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సందేశాలను ప్రజలకు చేరవేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతి కేంద్రంలో బాబా చిత్రపటానికి పుష్పమాలలు సమర్పణ చేసి, కార్యక్రమాల ఫోటోలను నిర్దిష్టంగా అప్‌లోడ్ చేయాలి. ప్రేమ, సేవ, శాంతి సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ హాలులో ఉదయం 10 గంటలకు అధికారికంగా శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొనున్నారనీ తెలిపారు. డివిజన్ మరియు మండల కేంద్రాల్లో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించాలన్నారు. శ్రీ సత్యసాయి బాబా బోధనలు ప్రేమ, సేవ, సాంత్వన, మానవత్వం పట్ల అపారమైన విలువలను మనకి అందించాయన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగే ఈ శతజయంతి ఉత్సవాలు ప్రజలకు ఆధ్యాత్మిక దిక్సూచిగా నిలుస్తాయని, ‘వసుధైవ కుటుంబకం’ భావనను బలపరుస్తాయని అన్నారు. సేవా దళ సభ్యులు, భక్తులు, వివిధ సంస్థలు కలిసి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ పసుమర్తి శ్రీనివాస్ రావు, శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల కొరస్పాండెంట్ శ్యామ్ సుందర్, డివిజనల్ పీఆర్వో ఎం. లక్ష్మణా చార్యులు, డిప్యూటీ తహసిల్దార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.


