విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డుల సమస్యలను పరిష్కరించేందుకు శనివారం రెవిన్యూ స్పెషల్ క్యాంప్ నిర్వహించారు. రెండో రోజు పెద్దకడబూరు గ్రామ రెవిన్యూ పరిధిలోని రైతుల సమస్యలపై రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ లలిత కుమారి, ఆర్ఐ జెర్మియా, మండల సర్వేయర్ తేజశ్విణి రైతుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల వారీగా రెవిన్యూ స్పెషల్ క్యాంపులు నిర్వహించి వినతులను స్వీకరిస్తామన్నారు. ఈ నెల 31 వరకు పెద్దకడబూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రెవిన్యూ స్పెషల్ క్యాంప్ జరుగుతుందన్నారు. నిషేదిత జాబితాలో (22ఏ1) ఉండి రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్న పట్టా భూములు, వెబ్ ల్యాండ్ అడంగల్ నందు ప్రభుత్వ భూములుగా నమోదై ఉన్న భూములు, చుక్కల భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వినతులను స్వీకరిస్తామన్నారు. రైతుల నుంచి వచ్చిన సమస్యలపై విచారణ చేసి పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఆయా గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు నరసన్న, వీరారెడ్డి, గ్రామ సర్వేయర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


