విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా) : విజయవాడలో ఇటీవల నిర్వహించిన బ్రిడ్జ్ఉ2025 సదస్సులో అనంతపురం జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ప్రత్యేక గుర్తింపు పొందిందని కరస్పాండెంట్ వీబీఆర్ శర్మ, చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. వారు ఎస్విఐటిలో మాట్లాడుతూ ఐసీటీ అకాడమీ, సీఎన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కార్యక్రమాలలో కళాశాల చురుకైన భాగస్వామ్యానికి గుర్తింపుగా ఈ అవార్డు లభించిందన్నారు. ఈ అవార్డును కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ కె. సత్యవర్ధన్ రెడ్డి స్వీకరించారు. ఐబీఎం స్కిల్స్ బిల్డ్ సహకారంతో కళాశాల యాజమాన్యం బీ.టెక్ విద్యార్థుల కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇండస్ట్రీ అకాడమీ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ, భవిష్యత్తుకు సిద్ధమైన విద్యార్థులను తయారు చేయడమే కళాశాల ప్రధాన లక్ష్యమన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న అధ్యాపకులు, నిర్వాహక బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎం.డి. వెన్నెపూస రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి. విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


