Homeఆర్థిక అసమానతలు తగ్గాలి

ఆర్థిక అసమానతలు తగ్గాలి

- Advertisement -

. సంపాదనలో కొంత భాగం సమాజానికి ఇవ్వాలి
. జన్మభూమికి ప్రవాసాంధ్రుల సేవలు స్ఫూర్తిదాయకం
. ముఖ్యమంత్రి చంద్రబాబు
. గుంటూరులో మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం

విశాలాంధ్ర -గుంటూరుసిటీ:డబ్బు ఉంటే సంతృప్తి రాదు…చాలామంది సంపాదించినది మొత్తం పిల్లలకే ఇవ్వాలనుకుంటారు… ఇవ్వాలి… కానీ అదే సమయంలో కొంత భాగం సమాజానికి ఇవ్వాలి. అందులో ఉండే తృప్తి మాటల్లో చెప్పలేదనిది. పేదలు డబ్బు సంపాదించుకునే అవకాశాలు వస్తేనే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జీజీహెచ్ లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు… కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. కానూరి-జింఖానా మాతా శిశు సంరక్షణ కేంద్ర నిర్మాణం కోసం కాలేజీ పూర్వ విద్యార్థులు రూ.100 కోట్ల విరాళాలను సమకూర్చగా… ఎక్విప్‌మెంట్, ఫర్నిచర్ కోసం రూ. 27 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ భవన నిర్మాణానికి పూనుకున్న జింఖానా అసోసియేషన్ సభ్యులు, వైద్యులకు అభినందనలు తెలిపారు. రూ.100 కోట్లు ఖర్చుపెట్టి భవన నిర్మించడమే కాదు, ఒక కార్పస్ ఫండ్ ద్వారా ఈ భవన నిర్మాణ నిర్వహణను కూడా బాధ్యతగా చేపట్టడం జింఖానా అసోసియేషన్ గొప్పతనమన్నారు. ఇక్కడి నుంచి విదేశాలకు, ఇతర ప్రాంతాలకు ఎదగడానికి వెళ్లిన చాలామంది తమ మూలాలను మర్చిపోతుంటారు. కానీ జన్మభూమిని, పుట్టిన ప్రాంతాన్ని మరిచిపోకుండా మీరు చదువుకున్న కళాశాలకు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్న మీ అందరి ప్రయత్నం ఒక స్ఫూర్తిదాయకం అన్నారు. మనమే బాగుంటే చాలదు… మన చుట్టూ ఉండే అందరూ బాగుండాలన్నారు. అమెరికాలో 16 ఏళ్లు దాటిన పిల్లల బయటికి వెళ్లిపోతారు. కానీ, కన్నబిడ్డలను చివరి వరకు కంటికి రెప్పలా కాపాడుకునే సంస్కృతి మన భారతదేశపు సొంతం అన్నారు. పేదరికం లేకుండా చేయాలని, ఆర్థిక అసమానతలు తగ్గించాలని బంగారు కుటంబాలు అనే విధానం తెచ్చామన్నారు. బంగారు కుటుంబాలు బాగుపడితే మార్గదర్శులుగా మారతారన్నారు. మీలో వీలైనంత మంది పేదలకు సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దాతల్లో చైతన్యం బాగా పెరుగుతోంది. తమ ప్రాంతాలతో పాటు, పలు కాలేజీలకు సహకరిస్తున్నారు. అంబేద్కర్‌కు ఆనాడు బ్యాంక్ ఆఫ్ బరోడా రాజు ఆర్థిక సాయం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి మనదేశంపై చెరగని ముద్ర వేశారు. అబ్దుల్ కలామ్‌కి అయ్యంగార్ సాయం చేశారు. బ్రాహ్మణులు…ముస్లింలకు సాయం చేసేందుకు ఇష్టపడని రోజుల్లో కలామ్ ప్రతిభ చూసి ప్రోత్సహించారు. భారతరత్నకు మారుపేరుగా కలామ్ తయారయ్యారన్నారు. నాడు తాను పిలుపు ఇచ్చిన జన్మభూమి కార్యక్రమానికి ఎంతోమంది ప్రవాసులు స్పందించి జన్మభూమికి సేవ చేశారని… ఇప్పుడు పీ4 కు పిలుపునిచ్చాంమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రహదారులు, ఎయిర్ పోర్టులు, విద్యుత్ రంగంలో వేగమైన అభివృద్ధికి పీ3 మోడల్ సరైన మార్గమని భావిస్తోందన్నారు. ఇండియాలో ఏముంది అని అడిగే వారి కోసం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఉంది అన్నది సమాధానమని చంద్రబాబు చెప్పారు. ఇంకో పదేళ్లలో గుంటూరు సహా అమరావతి రూపురేఖలు ఎలా ఉంటాయే మీరే చూస్తారన్నారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడ కార్పొరేషన్లు కలిసిపోతాయని… గుంటూరుకు 182 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందన్నారు. రెన్యువబుల్ ఎనర్జీతో పొల్యూషన్ అనేది ఉండదన్నారు. టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించే లక్ష్యంతో సంజీవని ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నామని వివరించారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లడుతూ మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణానికి ముందుకు వచ్చిన వైద్యులందరూ ఇక్కడ నేలపై ప్రేమతో చదువుకున్న కళాశాలకు, ఆసుపత్రికి తమ కష్టాన్ని భవన రూపంలో అందించారన్నారు. ప్రభుత్వ సహకారం ఉంటేనే ఎంత కష్టమైనా వెలుగులోకి వస్తుందన్నారు. అందుకు ఈ మాతా-శిశు ఆరోగ్యకే కేంద్రం ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. శంకుస్థాపనలు జరగాలన్న ప్రారంభోత్సవాలు జరపాలన్న అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతాయని గర్వంగా చెప్పగలుగుతున్నామన్నారు.
ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కష్టపడి సంపాదించిన డబ్బును కళాశాల అభివద్ధి కోసం, తల్లిబిడ్డల కోసం ధాతత్వం చూపడం గొప్పవిషయమన్నారు. పీపీపీ విధానంలోనే రాష్ట్రంలోని వైద్య కళాశాలను అభివద్ధి చేస్తామన్నారు. కానీ, ప్రతిపక్షాలు పీపీపీ విధానానాకి, ప్రైవేటైజేషన్‌కి తేడా తెలియకుండా అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్ అహ్మద్, కామినేని శ్రీనివాస్, సెక్రటరీ టూ గవర్నమెంట్ సౌరబ్ గౌర్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ప్రజాప్రతినిధులు, అధికారులు, జింఖానా అధ్యక్షుడు డాక్టర్ రామ కోటేశ్వరరావు, పూర్వ అధ్యక్షులు డాక్టర్ త్రిపురనేని రవికుమార్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు