తీవ్రమవుతున్న కొరత…సరఫరాలో జాప్యం
. బుకఅయినా… దరి చేరని సిలిండర్లు
. దిక్కుతోచని స్థితిలో సామాన్యులు
. టిఫెన్ బండ్ల వ్యాపారుల ఉపాధిపై ప్రభావం
. కట్టెల పొయ్యే దిక్కంటున్న హోటల్, రెస్టారెంట్ల వ్యాపారులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం దేశవ్యాప్తంగా వంట గ్యాస్ (ఎల్పీజీ) సరఫరాపై పడింది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లు నిలిచిపోవడం, సరఫరాలో జాప్యం జరగడం, ధరలు పెరగడం వంటి సమస్యలు వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. రోజువారీ కార్యకలాపాలను కొనసాగించడమూ కష్టంగా మారుతోందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఇంధన మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరను సుమారు రూ.60 పెంచగా, వాణిజ్య వినియోగానికి ఉపయోగించే 19 కిలోల సిలిండర్ ధరను రూ.115కు పెంచిన విషయం విదితమే. ఈ ధరలతో బాధపడుతున్న వ్యాపార రంగంపై సరఫరా కొరతతో మరింత భారం పడింది. రాష్ట్రంలో వినియోగించే మొత్తం ఎల్పీజీ గ్యాస్‌లో గృహ వినియోగం అత్యధికంగా ఉంది. దాదాపు 85 నుంచి 86 శాతం వరకు గ్యాస్ గృహ వినియోగానికి , మరో 9 నుంచి 10 శాతం వరకు వాణిజ్య రంగం వినియోగిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాటరింగ్ సంస్థలు, హాస్టళ్లు మొదలైనవి పూర్తిగా ఈ వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై ఆధారపడుతున్నాయి. ఇటీవల గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందకపోవడంతో సంబంధిత వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిలిండర్ల సరఫరా 40 నుంచి 50 శాతం వరకు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. తాజాగా వంట నూనె ధరలూ పెరిగాయి. ఇప్పటివరకు రూ.150గా ఉన్న లీటర్ వంటనూనె రూ.170కి చేరినట్లు సమాచారం. పరిస్థితి ఇలాగే కొనసాగితే…కార్మిక, కర్షకులు, రోజు వారీ కూలీలు, సాధారణ తోపుడుబండ్లు, చిన్నపాటి హోటళ్ల నిర్వాహకుల బతుకులు నడిరోడ్డున పడతాయి. అసంఘటిత కార్మికులు, చిరుద్యోగులకు లభించే టీ, అల్పాహారం, భోజనం సరసమైన ధరకు దొరక్కుండా పోయే ప్రమాదముంది.
గ్యాస్ కొరత సమస్య క్రమేపీ పెరుగుతోంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత పెరుగుతోందని హోటల్ యజమానులు చెబుతున్నారు. గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ సకాలంలో సిలిండర్లు అందకపోవడం వల్ల వంట కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. అనేక చోట్ల ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల స్టాక్ పూర్తిగా అయిపోవడంతో హోటళ్లు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేయాల్సిన పరిస్థితి. చిన్న, మధ్య తరహా హోటళ్లు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. రోజువారీ ఆదాయంపై ఆధారపడే ఈ వ్యాపారులకు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. గ్యాస్ కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ పెరుగుతున్నట్లు సమాచారం. అధికారికంగా సుమారు రూ.2వేల పరిధిలో ఉండే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను కొందరు అక్రమంగా రూ.3వేల నుంచి రూ.4 వేల వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి చిన్న వ్యాపారులకు మరింత భారంగా మారుతోంది. గ్యాస్ ధరలు పెరగడం, సరఫరా తగ్గడం, బ్లాక్ మార్కెట్ పెరగడం వంటి అంశాలు కలిసి హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే గృహ వినియోగదారులు సిలిండర్ కోసం బుక్ చేస్తుంటే తగిన స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు బుక్ చేసిన వారికీ ఐదారు రోజులైనా గ్యాస్ బండ రావడం లేదు. పెద్ద ఎత్తున బుకింగ్‌లు జరగడంతో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. ఇండేన్ గ్యాస్ ఐవీఆరఎస్ వాట్సాప్ బుకింగ్ పని చేయడం లేదు. రాష్ట్రంలో కోటిన్నర్రకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గ్యాస్ కొరతతో రోజు వారీ బుకింగ్‌ల సంఖ్య పెరుగుతోంది.గ్యాస్ కొరత రాకుండా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో హోటళ్లలో మళ్లీ సంప్రదాయ పద్ధతులైన కట్టెల పొయ్యలు, బొగ్గు వంటి ఇంధనాలను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఈ పద్ధతులను ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలోని ఓ రెస్టారెంట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. కొన్ని రెస్టారెంట్లు తాత్కాలికంగా తమ మెనూను తగ్గించుకోవడం, కొన్ని వంటకాల తయారీని నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. మరికొన్ని హోటళ్లు రోజులో కొద్ది గంటలే పనిచేస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో క్యాటరింగ్ సంస్థలు ముందుగానే అనేక ఆర్డర్లు తీసుకున్నాయి. సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఆ ఆర్డర్లను ఎలా నిర్వహించాలో అర్థం కావడం లేదని క్యాటరింగ్ యజమానులు చెబుతున్నారు. గ్యాస్ లేకపోతే భారీస్థాయిలో వంటలు చేయడం అసాధ్యమవుతుంది. దీంతో ఇప్పటికే తీసుకున్న ఆర్డర్లను రద్దు చేయాల్సి వస్తుందేమోనన్న ఆందోళన యజమానులున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించినప్పటికీ…అవి ఆచరణ సాధ్యం కావడం లేదు. హోటల్ రంగం కూడా లక్షలాది మంది ఉపాధికి ఆధారంగా ఉండటంతో వారికీ ప్రత్యేక కోటా కేటాయించాలని వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లకు కోత విధించడంతో ీVAటళ్ల నిర్వహణ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అంతర్జాతీయ పరిస్థితులు అస్థిరంగా కొనసాగితే గ్యాస్ ధరలు మరింత పెరగడం, సరఫరాలో మరింతగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హోటల్ రంగం, క్యాటరింగ్ రంగం, చిన్న వ్యాపారాలపై ప్రభావం తీవ్రతరం కానుందని వ్యాపార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వంట గ్యాస్, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరముంది.


