లాటరైట్ మైన్ వర్గీకరణలో మార్పులు సవరించండి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి
సీఎం చంద్రబాబు లేఖ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : లాటరైట్‌లో అల్యూమినియం శాతం 20శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే, దాన్ని ఉప ఖనిజంగా కాకుండా బాక్సైట్ గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించిందని, తక్షణమే లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులు సవరించాలని కోరుతూ సీఎం చంద్రబాబు మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో ఆయన ప్రస్తావించారు. కొత్త నిబంధనలతో గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టిందని తెలిపారు. నిలిచిపోయిన వాటిలో 19 లెటర్ ఆఫ్ ఇంటెంట్ దరఖాస్తులు, 113 ప్రభుత్వ భూముల దరఖాస్తులు, 255 అటవీ భూముల దరఖాస్తులు, 15 పట్టా భూముల దరఖాస్తులు ఉన్నాయని వివరించారు. పాత నిబంధనల మేరకు అప్లికేషన్ ఫీజులు, భూముల కొనుగోళ్లు, అటవీ అనుమతుల కోసం వందలాది మంది దరఖాస్తుదారులు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని పేర్కొన్నారు. గతంలో మైకా, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, బారైట్స్ ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్ క్లాజ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ ఇచ్చి, పెండింగ్‌లో ఉన్న 402 దరఖాస్తులను పాత రూల్స్ కిందనే వెసులుబాటు ఇవ్వాలని కోరారు. సేవింగ్ క్లాజ్ అమలు చేస్తే సిమెంట్, ఐరన్ ఓర్, రోడ్డు నిర్మాణ పరిశ్రమలకు ముడిసరుకు కొరత లేకుండా ఉపాధి నిలబడుతుందని తెలిపారు. సడలింపు ఇస్తే వందలాది మంది దరఖాస్తుదారులకు ఆర్థిక నష్టం తప్పుతుందని, కోర్టు వివాదాలు రావని సీఎం లేఖలో వివరించారు.


