ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వారిని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించరాదు
న్యూదిల్లీ: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అర్హతగా పేర్కొన్న క్వాలిఫికేషన్‌కు సంబంధించిన వారినే తీసుకోవాలని, అంతకంటే అధిక అర్హతలు ఉన్న వారిని తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తక్కువ అర్హతలు ఉన్న వారి కోసం ఉద్దేశించిన ఉద్యోగాన్ని ఎక్కువ అర్హతలున్న వారికి ఇవ్వడంవల్ల వాస్తవంగా అర్హత, యోగ్యత ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. తమిళనాడులోని ఒక బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన అటెండెర్‌గా నియమితుడైన పట్టభద్రుణ్ని ఆ ఉద్యోగం నుంచి తొలగించడాన్ని జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం సమర్థించింది. ఆ ఉద్యోగిని తొలగిస్తూ బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి పట్టభద్రుణ్ని ఉద్యోగంలో తిరిగి నియమిస్తూ మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసులో కక్షిదారుడు తాను పట్టభద్రుడినన్న వాస్తవాన్ని దాచి పదో తరగతి చదువుకున్న వ్యక్తులకు దక్కాల్సిన ఉద్యోగం పొందాడని, ఈ విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వోద్యోగాలు ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హత కలిగిన వారికే దక్కాలని పేర్కొంది. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేకపోయిన వ్యక్తులకు ప్రయోజనం కలిగించేందుకే కొన్ని ఉద్యోగాలకు తక్కువ విద్యార్హతను నిర్ణయిస్తున్నారని, ఇది సహేతుకమైన, సమానత్వ ప్రాతిపదికన రూపొందించిన నిబంధన అని ధర్మాసనం తెలిపింది. ‘ప్రభుత్వం ఒక ఆదర్శప్రాయమైన ఉపాధి కల్పన వ్యవస్థ. కొన్ని రకాల ఉద్యోగాలను తక్కువ విద్యార్హతలు కలిగిన వారికి రిజర్వు చేయడం ద్వారా సహేతుకమైన విధానాన్ని అవలంబిస్తోంది. అలాంటి ఉద్యోగాలు పొందేందుకు నిర్దేశించిన దానికంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్న వారిని అనుమతిస్తే వారితో తక్కువ చదువుకున్న అభ్యర్థులు పోటీ పడలేరు. ఉద్యోగం సాధించలేరు. అందుకే కొన్ని రకాల ఉద్యోగాలను తక్కువ అర్హతలు కలిగిన వారికి రిజర్వు చేయడాన్ని న్యాయస్థానాలు ఎప్ప్పుడూ సమర్థిస్తున్నాయి’ అని ధర్మాసనం పేర్కొంది.
ఉద్యోగ నియామక అర్హతలపై సుప్రీం కీలక ఆదేశం
- Advertisement -
RELATED ARTICLES


