ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు కలకలం రేపాయి.
తాజాగా కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున అధునాతన ఆయుధాలతో వచ్చిన సాయుధ వ్యక్తుల బృందం కాంగ్‌పోక్పి జిల్లా పరిధిలోని ఓ గ్రామంపై ఆకస్మికంగా దాడి చేసింది. గ్రామంలోని ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు గ్రామస్థులు బుల్లెట్ గాయాల కారణంగా అక్కడికక్కడే మృతి చెందారు.
కుకీ వర్గం ఇళ్లకు నిప్పు
కాల్పుల తర్వాత దుండగులు గ్రామంలోని కుకీవర్గానికి చెందిన పలు ఇళ్లకు నిప్పు పెట్టారు.
దీంతో మంటలు వేగంగా వ్యాపించి అనేక ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో గ్రామస్థులు ప్రాణభయంతో సమీప అటవీప్రాంతాలకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అస్సాం రైఫిల్స్,కేంద్ర భద్రతాబలగాలు,మణిపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. భద్రతా దళాలు వస్తున్న విషయం తెలుసుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని నిందితుల కోసం పరిసర ప్రాంతాలు,అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మరోసారి హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు కాంగ్‌పోక్పి జిల్లాతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.


