Homeఅంతర్జాతీయంముగిసిన ‘అమెరికా-ఇరాన’ యుద్ధం

ముగిసిన ‘అమెరికా-ఇరాన’ యుద్ధం

- Advertisement -

ఒప్పందంపై ట్రంప్, పెజెస్కియాన్ సంతకాలు
వాషింగ్టన్:
అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసింది. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ లాంఛనంగా సంతకాలు చేశారు. 14 అంశాలతో కూడిన ఈ ఒప్పందానికి ‘ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన’ అని పేరు పెట్టారు. కొన్ని రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఘాలిబఫ్ కూడా ఈ ఎంఓయూపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరుదేశాల అధ్యక్షులు దీనిపై సంతకాలు చేయగా…ఈ డీల్ తక్షణమే అమల్లోకి రానుంది.
ఫ్రాన్స్ వేదికగా…ట్రంప్ సంతకం
జీ7 శిఖరాగ్ర సమావేశం అనంతరం వెర్సైల్స్ ప్యాలెస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ విందు ఇచ్చారు. ఇక్కడ ట్రంప్ సంతకాల కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను వైట్‌హౌస్ విడుదల చేసింది. ‘ట్రంప్ వెర్సైల్స్‌లో ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంపై సంతకం చేశారు. ఇది శాశ్వత శాంతికి మార్గం సుగుమం చేస్తుంది. హోర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుంది. దీంతో త్వరలో ఇంధన ధరలు తగ్గుతాయి’ అని మెక్రాన్ ఓ పోస్టులో పేర్కొన్నారు. విందు అనంతరం ప్యాలెస్ నుంచి వెళ్తూ.. ఇరాన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు ట్రంప్ విలేకరులతో చెప్పారు. వాస్తవానికి సంతకాల కార్యక్రమం రేపు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరగాల్సి ఉండగా, ముందుగానే జరగడం గమనార్హం. అయితే, స్విట్జర్లాండ్‌లో ఇరుదేశాల ప్రతినిధుల సమావేశం ఉంటుందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు.
కొత్త ఆంక్షలు విధించరాదు: ఇరాన్
ఈ అవగాహన ఒప్పందంపై తాము కూడా సంతకం చేశామని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ పేర్కొన్నారు. అయితే, తమపై కొత్త ఆంక్షలు విధించడం గానీ, తమ ప్రాంతంలో సైనిక మోహరింపులు పెంచడం వంటివి చేయకూడదని స్పష్టంచేశారు. 60 రోజుల ఈ అవగాహన ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యలను అమెరికా చేపట్టకూడదన్నారు. తమ వద్దనున్న శుద్ధి చేసిన యురేనియం దేశంలోనే ఉంటుందని, దానిని విదేశాలకు తరలించబోమని తేల్చి చెప్పారు.
ఇస్లామాబాద్ ఎంఓయూ…
అమెరికా- ఇరాన్ మధ్య ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ కూడా ఈ సంతకాల విషయాన్ని ధ్రువీకరించింది. దీన్ని ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’గా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించుకున్నారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇందులో తొలి అడుగుగా ఇరాన్ తక్షణమే హోర్మూజ్‌ను పూర్తిగా తెరుస్తుందని, అమెరికా నావికా దిగ్బంధాన్ని ఎత్తివేస్తుందని వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు