సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
న్యూదిల్లీ: న్యాయసమీక్షను కోర్టుల ఆధిపత్యంగా చూడరాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. న్యాయసమీక్షాధికారాన్ని న్యాయ వ్యవస్థ ఆధిపత్యం అనే దృష్టితో చూడరాదని…రాజ్యాంగ సంస్థలు తమ విధి నిర్వహణలో విఫలమైనప్పుడు చట్టబద్ధమైన పాలనను సంరక్షించుకునే రాజ్యాంగ బాధ్యతలో భాగంగానే న్యాయ సమీక్షను రూపొందించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారాన్ని వినియోగించడంలో చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత అనేవి ప్రాథమికమైన ముందస్తు షరతులన్నారు. విస్తృతమైన న్యాయసమీక్షాధికారం భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని చెప్పడం అతిశయోక్తి కాదని తెలిపారు. ‘చట్టబద్ధపాలన సంరక్షణ-భారత్, స్వీడన్ అనుభవాలు’ అనే అంశంపై స్టాక్‌హోమ్‌లో ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. న్యాయసమీక్ష అధికారం మాత్రమే కాదని, అది న్యాయస్థానాలకు అప్పగించిన రాజ్యాంగ బాధ్యత అని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణలో న్యాయసమీక్ష, న్యాయస్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. చట్టబద్ధ పాలన అనేది ఒక సంక్షేమ పథకం కాదన్నారు. ఒక ఆర్థిక విధానం కూడా కాదని తెలిపారు. అది పేదరికాన్ని నిర్మూలించదని, ఉపాధినీ కల్పించదని తెలిపారు. అధికార వినియోగాన్ని క్రమశిక్షణాయుతంగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. దీని పని చాలా మౌలికమైనదని, తక్షణమే కనిపించదని జస్టిస్ సూర్యకాంత్ వివరించారు.
న్యాయసమీక్షను ఆధిపత్యంగా చూడొద్దు
- Advertisement -
RELATED ARTICLES


