రెండేళ్ల క్రితం అనుకుంటా ఖమ్మంలో తొలిసారి కలిసింది వంశీకృష్ణ అను అరÆనారీశ్వరుడ్ని. ఇద్దరం ఇంచుమించు ఒకే సమయంలో సాహిత్య రంగ ప్రవేశం చేశామనుకుంటా. నేను చదువుతో…వంశీకృష్ణ రాతతో. నేను ఎక్కువ రాయలేదు. చదువుకున్నా. ఈ జన్మకి చదువు చాలు… ఈ వాసనలు ఏమైనా మిగిలితే వచ్చే జన్మలో (నేను వచ్చే జన్మలో తెలుగు రాష్ట్రాల్లోనూ… సాహిత్య వాతావరణంలోనే పుడతానని నాకెందుకో గట్టి నమ్మకం) రాద్దాంలెమ్మని కాలం గడిపేశా. వంశీకృష్ణకి పూర్వ జన్మల మీదా, మరుజన్మల మీదా పెద్ద నమ్మకం ఉన్నట్లు నాకనిపించలేదు. అందుకని ఆయనేం చేశాడు. ఏం చేశాడంటే సుబ్బరంగా చదువుకున్నాడు. ఆ వెనక మరింత శుభ్రంగా రాశాడు. మనిషి ఎవరో తెలియనప్పుడు వారి కవిత్వమో, కథో చదివి వారిని ఊహించుకుంటాం కదా. అలాగే వంశీకృష్ణని కూడా నేను ఊహించుకున్నాను. కలిసినప్పుడు “దెబ్బడిపోయాంరా. ఇతగాడికి కళ్లజోడు ఉండదనుకున్నాం. ఉంది. వొత్తైన జట్టుంటుంది అనుకున్నాం. లేదు” అనుకున్నాను. ఈ రెండులో ఒకటి ఎందుకు ఉందో పది నిమిషాలు మాట్లాడాక అర్థం అయ్యింది. “వీడు చదువరి. అందుకే కళ్లు దొబ్బాయి” అనుకున్నాను. ఇక జుట్టంటారా… మళ్లీ నాకు నేనే ఇలా అనుకున్నాను. ఏమనుకున్నాయ్యా అంటే…”ఇతగాడి రాత ఇంత బాగుండడానికి కారణం ఈ “బోల్డు” చదువు “హెడ్డు” అన్నమాట” అని నిర్ధారించుకున్నాను. అంటే కళ్లజోడు పెట్టేసుకుంటే బాగా సదువుకున్నోడని, బట్టతలుంటే మంచి రాతగాడని అనుకుని తొందరపడి కూసేయకండి. కళ్లజోడు షాపుకి పరిగెత్తుకెళ్లి కొనేసుకోకండి. నాలాగే దెబ్బైపోతారు. అలాగే రెండు రోజులకు ఒకసారి కటింగ్ చేయించేసుకుని వంశీకృష్ణలా మంచి రాతగాడ్ని అని కూడా గొప్పలు పోకండి. మళ్లీ దెబ్బ మీద దెబ్బైపోతారు. ఈ చదువు, రాత అతని స్వంతం. ఇలా కళ్లకి జోడు వచ్చేలా చదవకపోతే “మౌన” అనే కథ రాయలేడు. ఒరియా కథలని మన ఇంట్లోనో, ఎదురింట్లోనో, పొరుగు వీధిలోనో జరిగినట్లుగా అనువదించలేడు. కావేరి ఒడ్డున కాళ్లు కడుక్కుని వస్తాడనకుంటే కవిత్వమై వచ్చాడు. లేదు లేదు… అక్కడ కొన్నాళ్లుండి ఇక్కడున్న మన కళ్లు కడిగాడు. ఆ కవిత్వం చదివాక ఇస్మాయిల్ అన్నట్లు మన కళ్లు ఎగరడం నేర్చుకున్నాయి. నాకు కథల్లో కవిత్వం పలికించే వారంటే వల్లమాలిన ఇది. నెత్తినెట్టేసుకుని ఊరేగను కాని, గుండెల్లో ఎట్టేసుకుంటాను. వొట్టు, నిజం, సత్తె పమాణికం. కావాలంటే మా యూరు అవలాపురంలో ఉన్న కోనసీమ డయాగ్నస్టిక్స్ ఓనర్ పాపారావుని అడగండి. ఆడే సెప్పాడు నాకు కూడా. ఆమధ్యన గుండె ఎక్స్రే తీయించుకుందుకు వెళ్తే. ఏం చెప్పాడంటరా. “బాబొరే బుజ్జిగా…మనల్ని అభిమానులు అలా పిలుత్తారులెండి. నీ గుండె పరాలేదు కానీ… దీనెమ్మ దాని రంగే గోధుమ రంగులా ఉందిరా. ఇదేదో కొత్త జబ్బెహె” అన్నాడు. ఆ పాపారావుగాడికి నాకు సానా స్నేహం. అందువల్ల ఈ రంగు మారిన గుండెట్రా బాబూ అని తెగ ఇదైపోయాడు. అప్పుడు నేను అన్నాను… “ఆడెవడో ఖమ్మంవోడురా… గోధుమ రంగు ఊహ అని ఓ కథ రాశాడు. పచ్చ కామెర్ల వోడికి లోకవంతా పసుపే అన్నట్లు ఆ కథ చదివిన కాడ్నించి పతిదీ గోధుమ రంగులో కనపడుతోందిరా. కథలో అతగాడు గోధుమ వాసన అన్నాడు కానీ…కథ చదివాక నేను ఎక్కడికి వెళ్లినా పూరీ, సపాతీ వోసన వస్తుందిరా ” అని గోధుమ రంగు కన్నీరు కార్చాను. చెప్పా కదా… కథల్లో కవిత్వం అంటే ఇష్టమని… ఇదిగో ఇవి చూడండి… “ఒక చిన్న వైరాగ్య మంటపం ఆ నవ్వు నిండా…” “మార్బుల్ వాసన, ఛాయ్ వాసన, మిత్రుడి వేదనల వాసనా కలిసి ఓ వింత సుగంథం ఏదో ఆ మరక నుండి సంగం కేఫ్ అంతటా వ్యాపిస్తున్నది…” “ఆ ఊహ మాత్రం చావు వాసన వేస్తోంది…” ఇవన్నీ కథల్లోవి. ఇక కవిత్వంలోకి తొంగి చూస్తే. ఖమ్మం సాహితీలోకంలో కెరీరిస్టులున్నారు, ఫెమినిస్టులున్నారు, మార్క్సిస్టులున్నారు, మగువిస్టులున్నారు. కానీ అందరూ ఇష్టపడే వారు మాత్రం వంశీకృష్ణే అని నాకు అనిపిస్తుంది. రెండు దశాబ్దాల క్రితం మాట. ఓ పాలి గొప్ప రచయిత, సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మని ఓ సాయంత్రం పూట అడిగాను. “తెలుగులో మీకు అత్యంత ఇష్టమైన రచయిత ఆ కాలంలో ఎవరండీ అని” దానికి ఆయన ఎత్తుపళ్లని దాచే ప్రయత్నం చేస్తూ…. “ రా.వి.శాస్త్రి. ఆయన కథలు, నవలలు చదివాక అప్పటికప్పుడు చచ్చిపోయి పెద కర్మలోగా ఆడపిల్లగా పుట్టేసి ఆయన మూడో పెళ్లాం అయిపోవాలని పించేది” అన్నారు గలాసు కింద పెడుతూ… నాకు కూడా బ్రూ కాఫీలా ఇంచుమించు ఇలాగే అనిపిస్తోంది వంశీకృష్ణని చదివి. అయితే, నా కూతురుందిగా. అందుకని ఇప్పటికిప్పుడు చావడం కుదరదు. వచ్చే జన్మలో మాత్రం కార్యదర్శి మాధవిగారు అంగీకరిస్తే వంశీకి మొగుడుగా పుట్టాలని ఉంది. ఏమో జరగచ్చేమో. గుండె గోధుమ వాసన వేసినప్పుడు ఇది మాత్రం ఎందుకు జరగదు. ఆయ్… జరుగుతుంది. జరిగి తీరుతుంది. “ఓయ్ కృష్ణవేణి… కాఫీ ఇస్తావా… లేదా….” ఆయన పాత్రలా… వచ్చే జన్మలో వంశీకృష్ణ పేరు అదే. నాకు కూడా జుట్టంటే చచ్చేంత ఇష్టం.
(ఇటీవలే ష్షటిపూర్తి జరుపుకున్న వంశీకృష్ణకి ప్రేమతో…)
సీనియర్ జర్నలిస్ట్, 99120 19929
కవి… కథక…. అర్ధనారీశ్వరుడు
- Advertisement -


