- అవసరమైతే వెంటనే వైద్య సహాయం – దిల్లీ హైకోర్టు ఆదేశం
- “ నేను బాగానే ఉన్నా…ప్రతి ఒక్కరూ ‘చలో సంసద్’లో పాల్గొనండి” వాంగ్‌చుక్ పిలుపు
న్యూదిల్లీ: జంతర్‌మంతర్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని దిల్లీ హైకోర్టు గురువారం అధికారులను ఆదేశించింది. అవసరమైతే వెంటనే వైద్య సహాయం అందించాలని కూడా స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, న్యాయమూర్తి తేజస్ కారియా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైందని పేర్కొంటూ, ప్రభుత్వ వైద్యులు వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని రోజువారీగా పరీక్షించాలని సూచించింది. కేంద్రం, దిల్లీ ప్రభుత్వాల తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ… ప్రతి వ్యక్తి ప్రాణం విలువైనదేనని, వాంగ్చుక్కు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడంపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం… “ఏ పౌరుడి ప్రాణమైనా అమూల్యమే. దానిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి” అని పేర్కొంది. సొలిసిటర్ జనరల్ వైఖరిని అభినందిస్తూ… వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షించి, అవసరమైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది. నీట్ పరీక్షలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకులపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) గత 25 రోజులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్‌లో నిరసన చేపడుతోంది. ఈ ఆందోళనకు సోనం వాంగ్‌చుక్ జూన్ 28న మద్దతు ప్రకటించి, అప్పటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మరో 48 గంటలు ఈ నిరాహారదీక్ష ఇలాగే కొనసాగితే 59 ఏళ్ల వాంగ్‌చుక్ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లొచ్చంటూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాంగ్‌చుక్ గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన పిటిషనర్… ఆయనకు బలవంతంగా ఆహారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు…తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా, 19 రోజులుగా వాంగ్‌చుక్ దీక్ష చేస్తున్నారు. ఇన్ని రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయన 9 కేజీల వరకు బరువు తగ్గారని వైద్యనిపుణులు చెబుతున్నారు. తాజాగా తన మద్దతుదారులను ఉద్దేశించి వాంగ్‌చుక్ ఒక వీడియో విడుదల చేశారు. “నా ఆరోగ్యం క్ష్మీణించిన మాట వాస్తవమే. కానీ అత్యంత ప్రమాదకర స్థితికేం దిగజారలేదు. నిరాహార దీక్ష విరమించాలని నన్ను అడగడానికి బదులు జులై 20న ‘చలో సంసద్’ పేరిట పార్లమెంట్ వరకు నిర్వహించే శాంతియుత మార్Ìలో భాగం కావాలి” అని మద్దతుదారులను ఆయన కోరారు.
కేజ్రీవాల్ సంఘీభావం
సోనం వాంగ్చుక్ను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం కలిశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన నిరశన దీక్షకు సంఘీభావం తెలిపారు. పరీక్షా పేపర్ లీకేజీలతో యువత నష్టపోతున్నారని…ప్రభుత్వం విద్యార్థులు, యువత, వాంగ్‌చుక్ ఆందోళనలను ఆలకించాలని కేజ్రీవాల్ కోరారు. నీట్ అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, సంస్కరణల కోసం దేశవ్యాప్తంగా యువత పోరాడుతోందని, సోనం వాంగ్‌చుక్ తన కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని కేజ్రీవాల్ అన్నారు.
వాంగ్‌చుక్ దీక్ష విరమించాలి: కాంగ్రెస్ విజ్ఞప్తి
తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సోనం వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని కాంగ్రెస్ గురువారం విజ్ఞప్తి చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై మాత్రం పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత కె.సి. వేణుగోపాల్ ‘ఎక్స్’లో స్పందిస్తూ… పరీక్షా వ్యవస్థ కుప్పకూలడానికి కేంద్ర ప్రభుత్వ జవాబుదారీతనం లోపించడమే కారణమని ఆయన విమర్శించారు. వాంగ్‌చుక్ ఆవేదన, ఆగ్రహాన్ని కాంగ్రెస్ పూర్తిగా అర్థం చేసుకుంటోందని, ఈ అంశంపై గత నెలన్నరగా తాము కూడా డిమాండ్ చేస్తున్నామని వేణుగోపాల్ తెలిపారు.
సినీ ప్రముఖుల మద్దతు
సోనం వాంగ్చుక్కు బాలీవుడ్ నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా నటులు ఇమ్రాన్ ఖాన్, ఫాతిమా సనా షేక్, సోనాక్షి సిన్హా తదితరులు వాంగ్‌చుక్ దీక్షకు సంఘీభావం తెలిపారు. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ… విద్యార్థులు నిజాయితీగా పరీక్షలు రాస్తే, పరీక్షలు నిర్వహించే సంస్థల నుంచి కూడా అదే స్థాయి జవాబుదారీతనం ఆశించాల్సి ఉంటుందని అన్నారు. నీట్ వివాదంతో నష్టపోయిన లక్షలాది మంది విద్యార్థులకు తాను అండగా ఉంటానని తెలిపారు. ఫాతిమా సనా షేక్, వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ… సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం అందరి బాధ్యత అని అన్నారు. సోనాక్షి సిన్హా వీడియో సందేశంలో మాట్లాడుతూ…దేశానికి ఎంతో సేవ చేసిన సోనం వాంగ్‌చుక్ తన డిమాండ్ల కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం యువత గొంతెత్తుతోందని, ప్రభుత్వం వారితో చర్చలు జరపాలని కోరారు. ఇటీవల షబానా ఆజ్మీ, జీనత్ అమాన్, ప్రకాశ్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, అభయ్ డియోల్ తదితర సినీ ప్రముఖులు కూడా వాంగ్చుక్కు మద్దతు తెలిపారు.


