Homeజాతీయంభారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్‌ ధర

భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్‌ ధర

- Advertisement -

ఢిల్లీలో రూ.202.. కోల్‌కతాలో రూ.209 తగ్గింపు
హైదరాబాద్‌లో రూ.206 తగ్గి రూ.2,985కు చేరిన ధర

ఆగస్టు 1 నుంచే కొత్త ధరల అమలు

గృహ వినియోగ ఎల్పీజీ ధరల్లో మార్పు లేదు
హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ సంస్థలకు కేంద్రం ఊరటనిచ్చింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధరను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు (ఓఎంసీలు) రూ.200కుపైగా తగ్గించాయి. తాజా ధరలు నేటి అమల్లోకి వచ్చాయి. అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.తాజా సవరణ ప్రకారం ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై రూ.202, కోల్‌కతాలో రూ.209 వరకు తగ్గింది. దీంతో కోల్‌కతాలో ఒక్కో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,872.50కు చేరింది. హైదరాబాద్‌లో రూ.206 తగ్గి రూ.2,985గా ఉంది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇదే పరిధిలో ధరలు తగ్గించినట్లు ఓఎంసీలు వెల్లడించాయి. ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపార సంస్థలపై ఇంధన భారం కొంత తగ్గనుంది.ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ ఇంధన ధరలు పెరగడంతో వాణిజ్య ఎల్పీజీ ధరలు పలుసార్లు పెరిగాయి. ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లు క్రమంగా స్థిరపడుతుండటంతో ఓఎంసీలు ధరలను తగ్గించాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఎల్పీజీ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.గత నెల జులై 1న కూడా 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.183.50 వరకు తగ్గించారు. వరుసగా రెండో నెలా ధరలు తగ్గడంతో వ్యాపార వర్గాలు ఊరట వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం గృహ వినియోగదారులకు నిరాశ కలిగిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు