Homeఆంధ్రప్రదేశ్రూ.30 వేల కోట్లతో విశాఖ ఏఐ డేటా సెంటర్‌.. తొలి దశకు భారీ పెట్టుబడి

రూ.30 వేల కోట్లతో విశాఖ ఏఐ డేటా సెంటర్‌.. తొలి దశకు భారీ పెట్టుబడి

- Advertisement -

గూగుల్‌ ఏఐ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నంలో అదానీకనెక్స్‌ నిర్మిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు తొలిసారిగా వెల్లడయ్యాయి.ఇటీవల జరిగిన తొలి త్రైమాసిక ఫలితాల ఎర్నింగ్స్‌ కాల్‌లో అదానీ గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ) జుగేశిందర్‌ (రాబీ) సింగ్‌ ఈ వివరాలను వెల్లడించారు.అదానీకనెక్స్‌ అనేది అదానీ గ్రూప్‌, అంతర్జాతీయ డేటా సెంటర్‌ ఆపరేటర్‌ ఎడ్జ్‌కనెక్స్‌ సంయుక్త సంస్థ.విశాఖపట్నంలో నిర్మిస్తున్న ఏఐ డేటా సెంటర్‌లో ఒక్కో మెగావాట్‌ సామర్థ్యం నిర్మాణానికి రూ.70-75 కోట్ల వరకు ఖర్చు కావచ్చని జుగేశిందర్‌ సింగ్‌ అంచనా వేశారు.అదే సమయంలో తమ పెట్టుబడులపై డాలర్లలో 12 శాతం ప్రతిఫలం (రిటర్న్‌) లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

తొలి దశకే రూ.30 వేల కోట్ల వ్యయం?
మొత్తం 1 గిగావాట్‌ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ఇందులో తొలి దశగా 400 మెగావాట్ల డేటా సెంటర్‌ సామర్థ్యాన్ని అదానీకనెక్స్‌ నిర్మిస్తోంది.ఒక్కో మెగావాట్‌కు గరిష్ఠంగా రూ.75 కోట్ల చొప్పున లెక్కిస్తే.. తొలి దశ 400 మెగావాట్ల నిర్మాణానికే దాదాపు రూ.30,000 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది.

ఎవరు ఎంత సామర్థ్యం ఏర్పాటు చేస్తారు?
ఈ ఏఐ డేటా సెంటర్‌ ప్రాజెక్టును గూగుల్‌, అదానీ సంస్థలు 2025 అక్టోబరులో ప్రకటించాయి.మొత్తం 1 గిగావాట్‌ ఏఐ డేటా సెంటర్‌ సామర్థ్యాన్ని మూడు ప్రాంగణాల్లో అభివృద్ధి చేయనున్నట్లు అప్పట్లో వెల్లడించారు.ఈ ప్రాజెక్టులో అదానీకనెక్స్‌తో పాటు భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ఎన్‌ఎక్స్‌ట్రా కూడా భాగస్వామిగా ఉండనుంది.ఈ మూడు ప్రాంగణాలను అదానీకనెక్స్‌, ఎన్‌ఎక్స్‌ట్రా కలిసి అభివృద్ధి చేస్తాయని గూగుల్‌ వెల్లడించింది.అయితే ఈ మూడు సంస్థల్లో ఎవరు ఎంత సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనున్నారు? ఒక్కో సంస్థకు ఎంత మెగావాట్ల బాధ్యత ఉంటుంది? అనే పూర్తి వివరాలు ఇప్పటివరకు వెల్లడికాలేదు.

అంతర్జాతీయ టెక్‌ గమ్యస్థానంగా విశాఖ
1 గిగావాట్‌ సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న గూగుల్‌ ఏఐ హబ్‌లో భాగంగా అదానీకనెక్స్‌కు లభించిన 400 మెగావాట్ల ఆర్డర్‌ ను భారత్‌లో అత్యంత కీలకమైన ఏఐ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటిగా పరిగణించవచ్చని అదానీకనెక్స్‌ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృత్రిమ మేధ రంగంలో భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి మరింతగా తెలుస్తుందని ఆయన అన్నారు. ఇంతటి చారిత్రాత్మక ప్రాజెక్టులో గూగుల్‌తో కలిసి పనిచేయడం గర్వకారణమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం అంతర్జాతీయ టెక్నాలజీ గమ్యస్థానంగా ఎదిగే అవకాశం ఉందని అదానీకనెక్స్‌ ప్రతినిధి అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు