విశాలాంధ్ర – పుట్టపర్తి: హిందూపురం ప్రాజెక్ట్ కార్యాలయంలో సిడిపిఓ వరలక్ష్మి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్ఓను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ పరిధిలోని వివిధ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సూపర్వైజర్ స్థాయి నుంచి సిడిపిఓ వరకు, కార్యాలయ సిబ్బంది వరకు వ్యవస్థ మొత్తం అవినీతిమయంగా మారిందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఐసీడీఎస్ శాఖను ప్రక్షాళన చేయాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేస్తోందని, అయితే ఆ నిధులను కొందరు అధికారులు అక్రమ బిల్లుల ద్వారా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది తో కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.ఈ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ సెక్రటరీ ఈ.ఎస్. వెంకటేష్, ప్రాంతీయ కార్యదర్శి వినోద్ పాల్గొన్నారు.
సిడిపిఓ అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి: ఏఐటీయూసీ డిమాండ్
- Advertisement -
RELATED ARTICLES


