Homeజిల్లాలుఅనంతపురంటార్గెట్ ' @అరవ తోట '

టార్గెట్ ‘ @అరవ తోట ‘

- Advertisement -

​ ​ముఠాగా ఏర్పడి సంచరిస్తున్న దొంగలు
​ భయంతో బెంబేలుతున్న కాలనీవాసులు
​ గస్తీ మరిచిన పోలీసు విభాగం
​ రక్షణ కల్పించాలని ప్రజల వేడుకోలు

​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండల కేంద్రం రాప్తాడులోని అరవ తోట కాలనీలో దొంగల ముఠా వరుసగా సంచరిస్తుండటంతో కాలనీవాసులు భయాందోళనలతో కాలం వెళ్లదీస్తున్నారు. వారంలో రెండుసార్లు ముసుగు దొంగలు గుంపుగా వీధుల్లోకి రావడంతో రాత్రివేళల్లో ప్రజలు నిద్రలేకుండా కాపలా కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. గత శనివారం అర్ధరాత్రి వేళ ముఖాలకు గుడ్డలు కట్టుకుని ఎనిమిది మంది దొంగలు ముఠాగా కాలనీలోకి ప్రవేశించారు. కొంతమంది ఇళ్లలోకి చొరబడేందుకు యత్నించగా, శబ్దాలు రావడంతో ఉలిక్కిపడిన స్థానికులు తేరుకుని వెంటాడటంతో పండమేరు వంక వైపు పారిపోయారు. అలాగే సోమవారం తెల్లవారుజామున మరో నలుగురు దొంగలు రాగా ఓ దొంగ ఓ ఇంట్లోకి వెళ్లేందుకు నిచ్చెన వేసి ఎక్కుతుండగా, వీధి కుక్కలు మొరగడంతో స్థానికులు బయటకు వచ్చారు. కాలనీవాసులు అతన్ని పట్టుకునేందుకు వెంబడించగా సమీపంలోని మామిడితోటలోకి పారిపోయాడని స్థానికులు తెలిపారు.

ముఠా ​ వ్యక్తులు వలస కూలీలా? స్థానికులా?

రాప్తాడు పెద్ద పంచాయతీ కావడం, పొట్టకూటి కోసం జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి అనేకమంది వలస వచ్చి ఇక్కడ కూలీ పనులు చేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో ముసుగులు ధరించి వస్తున్న వారిని చూస్తే ఇతర రాష్ట్రాల వారా లేక స్థానికులా అనేది అర్థం కావడం లేదని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సహకారం లేకుండా కొత్త వ్యక్తులు ఇలా దొంగతనాలకు తెగబడే అవకాశం తక్కువని కూడా చర్చించుకుంటున్నారు.

​ *చీకట్లో మందుబాబుల హంగామా..?

ఈ కాలనీలో దాదాపు 500 కుటుంబాలు నివాసముంటున్నాయి. రోజంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో సొంతిళ్లను నిర్మించుకున్నారు. అయితే, కాలనీలోని కొన్ని వీధుల చివరల్లో లైట్లు వెలగకపోవడంతో చీకటి అలుముకుంటోంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో తమ ఇళ్లల్లోకి దొంగలు ఎక్కడ పడి దోచుకుంటారోనని భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా శ్రీ నీలకంఠేశ్వరస్వామి గుడి నుంచి పండమేరు వంకకు వెళ్లే దారిలో చీకటిని అదునుగా చేసుకుని అర్ధరాత్రి వరకు మందుబాబులు సేవిస్తూ హంగామా చేస్తున్నట్లు సమాచారం.

రాత్రివేళ గస్తీని మరిచిన పోలీసులు

రాత్రి వేళల్లో గ్రామీణ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాల్సిన పోలీసులు పెట్రోలింగ్‌ను పూర్తిగా విస్మరించారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో ‘డయిల్ 100’కు నాలుగైదు సార్లు ఫోన్ చేసినా స్పందన లేదని వాపోతున్నారు. చీకటిగా ఉన్న వీధుల్లో దీపాలు వేయించాలని పంచాయతీ అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

​గస్తీ తిరుగుతున్నాం
రాప్తాడు సీఐ వెంకటేసులు

​”రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ప్రతిరోజూ గ్రామాల్లో పోలీసు గస్తీ నిర్వహిస్తున్నాం. గ్రామాల్లోని కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసులను స్పందిస్తే తగిన చర్యలు తీసుకుని రక్షణ కల్పిస్తాం.”

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు