. ఆక్వా రైతులందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొందాలి
. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
విశాలాంధ్ర – భీమవరం: జిల్లాలోని ఆక్వా రైతుల సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మత్స్యశాఖ, తూనికలు–కొలతలు, కమర్షియల్ టాక్స్, ఎంపెడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 16న ఆక్వా రైతుల సంఘం ఇచ్చిన దరఖాస్తుపై ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆక్వా రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొందాలని, అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల పెంపు, అమెరికన్ టాక్స్ అంశం, నాసిరకం సీడ్ సమస్యలపై అధికారులతో చర్చించారు. జిల్లాలోని ఆక్వా షాపులను మత్స్యశాఖ, ఎంపెడ, డ్రగ్స్ కంట్రోల్ శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నాసిరకం సీడ్ కారణంగా వ్యాప్తి చెందుతున్న ఈపిహెచ్ వ్యాధి నిర్ధారణ కోసం ఆక్వా చెరువుల నుండి శాంపిల్స్ సేకరించి వాటిని కాకినాడలోని “భారత మత్స్య సాంకేతిక సంఘం” (SIFT)లో పరీక్షించి నివేదిక సమర్పించాలని జిల్లా మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే సీడ్ ధరల పెంపుపై జిల్లాలోని ఆక్వా షాప్ డీలర్స్ అసోసియేషన్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.వి.ప్రసాద్, ఎంపెడ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ ఆనంద్, ఎఫ్‌డీఓ వివేక్, తదితరులు పాల్గొన్నారు.


