హైదరాబాద్‌లో సభ పెట్టుకునేందుకు అనుమతించేలా తెలంగాణ పోలీసులకు ఆదేశాలివ్వాలంటూ హైకోర్టుకు వెళ్లిన జనసేన పార్టీకి చుక్కెదురైంది. ఈ మేరకు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన హైదరాబాద్‌లో సభ నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ పార్టీ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో కలిసి పాత్రికేయ సమావేశం నిర్వహించనున్నారు. కనీసం దీనికైనా అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్‌్ణ వేదికగా పోస్ట్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నవనిర్మాణ్ పేరిట సభ నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. దీన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాయి. గతంలో పవన్ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారంటూ విమర్శలు గుప్పించాయి. అలాంటి వ్యక్తికి తెలంగాణపై సభ పెట్టుకునే హక్కు లేదని ధ్వజమెత్తాయి. అధికార కాంగ్రెస్ శ్రేణులు సైతం పవన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు సభకు నిరాకరించినట్లు తెలుస్తోంది.


