Homeజిల్లాలుఅనంతపురందళితులు, గిరిజనులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయి — సిపిఐ జగదీష్

దళితులు, గిరిజనులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయి — సిపిఐ జగదీష్

- Advertisement -

సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం జనగణనలో కులగణన చేపట్టాలని నవంబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

విశాలాంధ్ర బ్యూరో, అనంతపురం:దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయని, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురంలోని సిపిఐ కార్యాలయంలో బి. కేశవరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.జగదీష్ మాట్లాడుతూ, దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు నవంబర్ 18న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. “నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతుండగా, ఈ కాలంలో దళితులు, గిరిజనులు, మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఈ దాడులను ప్రోత్సహించే విధంగా పాలన కొనసాగుతోందన్న భావన ప్రజల్లో ఏర్పడుతోంది” అని ఆయన విమర్శించారు.అదేవిధంగా దేశంలో మతోన్మాదం, అంటరానితనం, కుల, మత విభజనలు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్, సంఘపరివార్ ప్రభావంలో రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువలు దెబ్బతింటున్నాయని తీవ్రంగా విమర్శించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఎస్సీలపై 57,789 కేసులు, ఎస్టీలపై 12,960 కేసులు, మహిళలపై 4.48 లక్షల నేరాలు నమోదవడం దేశానికి సిగ్గుచేటని అన్నారు. “ప్రతి ఏటా ఈ నేరాలు పెరుగుతుండటం భయానక పరిణామం” అని ఆందోళన వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు స్థానిక సంస్థల్లో కేటాయించిన స్థానాలు తగ్గించడం వల్ల వేలాది మంది బీసీలు పదవులు కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కులగణన ఆధారంగా కేటాయింపులు చేపట్టినట్లు పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే విధంగా కులగణన చేపట్టి దాని ఆధారంగా సామాజిక న్యాయం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 143 వెనుకబడిన కులాలు ఉన్నప్పటికీ బీసీలకు స్థానిక సంస్థలలో కేటాయించిన స్థానాలు తగ్గించడముతో వేలాది బీసీలు పదవులు కోల్పోయారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టి దాని ఆధారంగా స్థానాలు కేటాయించిందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని జగదీష్ డిమాండు చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం జనగణనలో కులగణన చేపట్టాలనే ప్రధాన డిమాండుతో సిపిఐ ఆధ్వర్యంలో నవంబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని సిపిఐ జాతీయ సమితి పిలుపునిచ్చిందని సిపిఐతో కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగదీష్ సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు సి. జాఫర్, జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, జె. రాజారెడ్డి, జిల్సలా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్. శ్రీరాములు, పీఠల రామకృష్ణ, గుంతపల్లి గోపాల్, తలారి నారాయణస్వామి, అన్నగిరి పద్మావతి, బి. గోవిందు, టి. రంగయ్య, సి. లింగమయ్య, బి. రమణయ్య, ఎం. నాగార్జున, జి. సంతోష్ కుమార్, డి. చెన్నప్ప యాదవ్, జె. మల్లికార్జున, శ్రీశైలంరాజేష్ గౌడ్, ఎం. రమేష్, ఈ. కుళ్లాయిస్వామి, జి. చిరంజీవి, ఎస్. నాగరాజు, డి. పెద్దయ్య, పార్వతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు