విశాలాంధ్ర – పాయకరావుపేట : మండలంలోని గుంటపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న 42 మంది విద్యార్థులకు సైకిళ్లు, 399 మంది రైతులకు రాజముద్ర తో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గెడ్డం బుజ్జి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గెడ్డం బుజ్జి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సొంత నిధులతో నియోజకవర్గంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందజేసినట్లు తెలిపారు. పదవ తరగతి తర్వాత చాలా మంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లే వీలు లేక చదువు ఆపేస్తున్నారన్న కారణంగానే మంత్రి వంగలపూడి అనిత విద్యార్థుల చదువు కొనసాగించేందుకు సైకిళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇతరుల ఫోటోలతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారని, వాటి స్థానంలో రాజముద్రతో పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నామవరం పీఏసీఎస్ అధ్యక్షులు గెడ్డం కన్నబాబు, పల్లి దుర్గారావు, సుంకర సూరిబాబు, కక్కల శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


