విశాలాంధ్ర, గుంతకల్లు: రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇవ్వకుండా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి. జగదీష్ తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం స్థానిక సీపీఐ పట్టణ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.సిపిఐ నేత జగదీష్ మాట్లాడుతూ రైతులకు పది రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ప్రచారం చేసుకుంటున్నదే ప్రభుత్వాల పని అని విమర్శించారు. పప్పు, సెనగ, కంది, మొక్కజొన్న వంటి పంటలను దేశీయ రైతులు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవడం రైతులను నష్టాల్లోకి నెడుతోందన్నారు.ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న హామీ ఇచ్చినా ఎక్కడా వాటిని ఏర్పాటు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కొనుగోలు కేంద్రాలు తెలంగాణలో ఏర్పాటు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యం చూపించడం రైతుల సమస్యలను మరింత పెంచిందని అన్నారు. అరటిపంటకు టన్నుకు ₹1500 మాత్రమే వస్తుండగా, కూలీల ఖర్చుల కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని వివరించారు.రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసి విదేశాలకు పంపిణీ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో ఎమ్మెల్యేలు తిరగాలని ప్రభుత్వం చెబుతోందని, అయితే పొలాల్లో ఎంత నష్టం జరిగిందో ప్రత్యక్షంగా చూసే ధైర్యం లేక గ్రామాలకు రాలేక పోతున్నారని అన్నారు.విశాఖలో చేసిన 13 లక్షల కోట్ల ఒప్పందాలు ప్రభుత్వ ప్రచార్బాటమేనని అన్నారు రైతుల సమస్యలపై రేపు విజయవాడలో జరిగే సీపీఐ సమ్మిట్‌లో చర్చించి, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోవిందు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు బి. మహేష్, సీపీఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సహాయ కార్యదర్శి గౌస్, ఏఐటీయూసీ మండల నాయకులు ఈశ్వరయ్య, సీపీఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


